పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ: ఏం జరిగిందంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనుచిత, ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కళ్యాణ్‌కు అనిత వివరించారు.
చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసినవారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు. తానూ ఫేక్ పోస్టు బాధితురాలినంటూ అనిత పవన్ కళ్యాణ్ తో అన్నారు. తన కూతురు కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ ఈ సందర్భంగా చెప్పారు.

తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వాటిని చూసి వారు కన్నీరు పెట్టుకోవడంతో ఆవేదన చెందానని పవన్ తెలిపారు. ఇంట్లోంచి బయటకు రావడానికి తన బిడ్డలు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని అన్నారు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనితతో కూడా పవన్ చెప్పారు.
కాగా, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక, వ్యక్తులపై అనుచిత పోస్టులు, పోలీసుల రియాక్షన్‌పై పవన్ కళ్యాణ్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పోలీసులు నేరస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, సోషల్ మీడియా వ్యవహారం, పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ సర్కారు వల్లే కొందరు పోలీసులు గాడి తప్పారని, ఆ దోరణి నుంచి వారింకా బయటపడటం లేదన్నారు. 'మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిద్దాం. నెలలో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడదాం అని చంద్రబాబు తెలిపారు. 'నాతో సహా, క్రియాశీల నేతలు, శ్రేణుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. నీచంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా బాధితురాలే. ఫేక్‌పోస్టుల వ్యవహారం న్యూసెన్స్‌గా మారింది. గతంలో లేని విషసంస్కృతి వ్యాపించింది. దొంగ ఐపీలతో పోస్టులు పెట్టి తప్పించుకుంటున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications