నో క్లారిటీ!: రెచ్చిపోతున్న బీజేపీ, తెలుసుకోకుండానే పవన్ మద్దతిచ్చారా?
అమరావతి: ప్రత్యేక హదా పైన తమను ప్రశ్నిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని బీజేపీ-టీడీపీలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అదే హోదా పైన ఇప్పుడు పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన పైన బీజేపీ, టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. బీజేపీ నేతలు అయితే ఆయనపై తీవ్రంగా మండిపడుుతున్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెబుతున్న బీజేపీ నేతలకు కొంతమంది కౌంటర్ ఇస్తున్నారు.
ఈరోజు పవన్‌ను తెలుసుకొని మాట్లాడాలని బీజేపీ నేతలు చెబుతున్నారని, మరి 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుసుకోకుండా మీకు మద్దతు పలికారని భావిస్తున్నారా అని నిలదీస్తున్నారు. మద్దతిస్తే ఒకలా, ఇచ్చిన హామీని ప్రశ్నిస్తే మరోలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల సమయంలో చెప్పినట్లే ప్రశ్నిస్తున్నారు
పవన్ కళ్యాణ్ ఇతర రాజకీయ పార్టీల్లా రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం లేదని, నాడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు సమస్యలు, హామీల పైన సందర్భం వచ్చినప్పుడు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతూ... ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా పట్టుబట్టింది బీజేపీ అని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా ఆ పాయింట్ పైనే పవన్ మద్దతు పలికారని గుర్తు చేస్తున్నారు.

ఆనాడు కూడా తెలుసుకొని మాట్లాడమని చెప్పలేదేం
స్వయంగా మోడీ కూడా పవన్ పాల్గొన్న బహిరంగ సభలోనే, తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఆ బీజేపీ ఇచ్చిన హోదా పైనే ప్రశ్నిస్తుంటే ఇప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పడం విడ్డూరమంటున్నారు. 2014లో మద్దతిచ్చినప్పుడు కూడా తెలుసుకొని మద్దతివ్వాలని ఎందుకు అనలేదని అంటున్నారు.

హోదా బదులు ఏం ఇస్తున్నామో
హోదా విషయమై పవన్ తెలుసుకొని మాట్లాడాలని చెబుతున్న బీజేపీ, టీడీపీ నేతలు ఆయనకు క్లారిటీ ఇవ్వవచ్చు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నాడు మద్దతిచ్చేందుకు ఆయన రోడ్డెక్కారని, ఇప్పుడు ఆయన వద్దకు వెళ్లి హోదా బదులు ఏం ఇస్తున్నామో, హోదా ఇవ్వనప్పటికీ తాము ఇచ్చే నిధుులు దానికి సమానంగా ఎలానో చెప్పవచ్చు కదా అంటున్నారు.

టిడిపి-బిజెపి మధ్యనే క్లారిటీ లేదా
అసలు, హోదా, ప్యాకేజీ విషయంలో మిత్రపక్షాలైన టిడిపి, బిజెపిల్లోనే క్లారిటీ లేదని గుర్తు చేస్తున్నారు. హోదా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని వెంకయ్య చెబితే, అసలు హోదా వల్ల లాభం కన్న నష్టమే ఎక్కువ అని సుజన చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. హోదా వల్ల నష్టం అని తెలిసినప్పుడు హామీ ఎలా ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇచ్చే నిధులు విభజన చట్టంలో ఉన్నవే
అలాగే, ఇచ్చే, ఇచ్చిన నిధుల పైన కూడా టిడిపి, బిజెపిలలో తేడా కనిపిస్తోందని అంటున్నారు. పైగా, రోడ్లకు ఇచ్చిన నిధులు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు చట్టంలోనే ఉన్నాయని, వాటిని ఇచ్చామని చెప్పడం ఏమిటని విపక్షాలు ప్రశ్నించాడాన్ని గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీలలోనే క్లారిటీ లేనప్పుడు పవన్‌ను తెలుసుకోమని చెప్పడం ఏమిటంటున్నారు.












Click it and Unblock the Notifications