ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీని టీడీపీ గెలిచిందిలా ? గంటా స్కెచ్, కాపుల టర్నింగ్, అభ్యర్ధి మార్పు..!
ఏపీలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు వెనుక ఎక్కడికక్కడ స్ధానికంగా అమలుచేసేన వ్యూహాలే కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
ఏపీలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి అనూహ్య షాక్ తగిలింది. మూడు స్ధానాల్లో రెండింటిని కైవసం చేసుకతున్న టీడీపీ మరో స్ధానంలోనూ వైసీపీకి గట్టిపోటీ ఇస్తోంది. ఇందులో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్ధానంలో టీడీపీ భారీ గెలుపు అందుకుని రాజధాని ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై పట్టు సంపాదించాలన్న వైసీపీ ఆశలకు గండికొట్టింది. దీని వెనుక ఏపీ రాజకీయాల్ని భారీ మలుపు తిప్పగల చాలా కీలక కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

టీడీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గెలుపు
ఉత్తరాంధ్రలో జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధి వేపాడ చిరంజీవి రావు ఘనవిజయం సాధించారు. ముఖ్యంగా అధికార వైసీపీ నిలబెట్టిన సీతంరాజు సుధాకర్ ను దాదాపు 15 శాతం ఓట్ల తేడాతో చిరంజీవి రావు మట్టికరిపించడం సంచలనం రేపుతోంది.
ఈ ఎన్నికల్లో గెలుపుపై ఏమాత్రం ఆశల్లేని పరిస్ధితుల్లో అభ్యర్ధులే దొరకని టీడీపీ చివరికి ఘన విజయంతో ఈ ఎన్నికను ముగించడం ఇప్పుడు అధికార వైసీపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాలా అండగా నిలిచినా వైసీపీ ఓటమిపాలవ్వడం వెనుక టీడీపీ రచించిన భారీ వ్యూహాలే ఉన్నాయి.

బీసీని కాదని కాపు అభ్యర్ధికి సీటు
ఉత్తరాంధ్రలో బీసీ జనాభా చాలా ఎక్కువ. అలాగే గత ఎన్నికల్లో బీసీలు టీడీపీని వీడి వైసీపీకి మద్దతిచ్చారు. దీంతో ఈసారి ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గమైన నాగవంశీయులకు చెందిన గాండ్ల చిన్ని లక్ష్మీకుమారిని టీడీపీ అభ్యర్ధిగా నిలబెట్టింది. గెలుపుపై ఏమాత్రం ఆశల్లేని పరిస్ధితుల్లో అభ్యర్ధే దొరకని టీడీపీ.. చివరికి లక్ష్మీకుమారిని ఎంచుకుంది.
దీంతో లక్ష్మీకుమారి సొంత బలంపైనా గెలవాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఆమె గెలుపుపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. అయితే చివరి నిమిషంలో ఆమెను తప్పించి కాపు సామాజిక వర్గానికి చెందిన వేపాడ చిరంజీవిని రావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇదే చివరికి టీడీపీని గెలుపు దిశగా నడిపించింది.

వైసీపీని కాదని టీడీపీవైపు కాపులు?
బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిలబెట్టిన వైసీపీ.. ఆయన గెలుపు కోసం సర్వశక్తులొడ్డింది. ఇదే క్రమంలో కాపులతో ఓ సమావేశం కూడా పెట్టించింది. దీనికి స్ధానికంగా కీలకంగా ఉన్న కాపు నేతల్ని ఆహ్వానించలేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు మరికొందరు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల్ని మాత్రమే దీనికి ఆహ్వానించారు.
దీంతో కాపు సామాజికవర్గంలో మంటపుట్టింది. అదే సమయంలో టీడీపీ కూడా ఈ పరిస్ధితిని సొమ్ముచేసుకునేందుకు కాపు అభ్యర్ధి చిరంజీవిరావును బరిలోకి దింపింది. దీంతో వైసీపీ నిలబెట్టిన బ్రహ్మణ అభ్యర్ధిని కాదని టీడీపీ నిలబెట్టిన కాపు అభ్యర్ధికి అండగా నిలవాలని కాపులు నిర్ణయించుకున్నారు. తుదికంటా అండగా నిలిచి తమ సామాజిక వర్గ అభ్యర్ధిని వారు గెలిపించుకున్నారు.

ఫలించిన గంటా వ్యూహాలు?
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీకి దూరంగా ఉండిపోయిన గంటా శ్రీనివాసరావు.. ఈ మధ్యే యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని గెలిపించడం ద్వారా విశాఖలో తన సత్తాచాటాలనుకున్న గంటా.. అంతా తానే అయ్యారు. టీడీపీ అభ్యర్ధి మార్పుతో పాటు స్ధానిక నేతలతో వరుసగా సంప్రదింపులు జరిపి వేపాడ చిరంజీవిరావు విజయానికి బాటలు వేసారు.
చివరికి చిరంజీవిరావు గెలుపుతో గంటా సత్తా నిరూపించుకున్నారు. ఇప్పుడు గంటాను నమ్ముకుని విశాఖలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ వ్యూహరచన చేసే స్ధాయికి ఆయన చేరిపోయారు. గంటా రీఎంట్రీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీడీపీ అవకాశాల్ని మరింత మెరుగుపరిచిందనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications