నారీ నారీ 'నడుమ' మురారి... పవన్ కల్యాణ్!!
కొద్దిరోజులుగా మౌనంగా ఉంటోన్న పవన్ కల్యాణ్ తాజా రాజకీయాలపై ఎందుకు స్పందించడంలేదా? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం ఆలోచిస్తున్నారు? ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? వారాహి యాత్రను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఒప్పుకున్న సినిమాలను ఎప్పుడు పూర్తిచేయబోతున్నారు? ఏపీ, తెలంగాణలో పొత్తులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏపీ బీజేపీ రమ్మంటోంది.. తెలంగాణ బీజేపీ వద్దంటోంది.. అసలు పవన్ కల్యాణ్ ఏమి ఆలోచిస్తున్నారు? ఏమైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా?.. ఇవే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్నాయి.

ఎందుకు స్పందించడంలేదు?
కొద్దిరోజులుగా మౌనంగా ఉంటోన్న పవన్ కల్యాణ్ తాజా రాజకీయాలపై ఎందుకు స్పందించడంలేదా? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన తనతోనే ఉందని, ఎన్నికలకు కలిసే వెళతామని తాజాగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో కూడా జనసేన మద్దతు బీజేపీ అభ్యర్థి మాధవ్ కు ఉందన్నారు. జనసేన వైపునుంచి అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ఏపీ రమ్మంటోంది.. తెలంగాణ వద్దంటోంది
తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో తమకు పొత్తుండదని ప్రకటించారు. ఏపీ బీజేపీ జనసేన కావాలంటోంది.. తెలంగాణ బీజేపీ వద్దంటోంది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవన్ సన్నిహితంగా వ్యవహరిస్తారని, కేటీఆర్ ను కలుస్తారని, పరిపాలన బాగుందని మెచ్చుకుంటారని, తమకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తులను, పార్టీ నేతలను కలిసే పవన్ కల్యాణ్ అవసరం తమకు లేదన్నట్లుగా సంజయ్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే హఠాత్తుగా పీవీ నరసింహారావు కుమార్తెకు పవన్ మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ తరఫున ఆమె పోటీచేసి విజయం సాధించారు.

స్పందించని జనసేన
ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోన్న జనసేన ఏపీ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఏమీ స్పందించడంలేదు. తాజాగా కేసీఆర్ వెయ్యికోట్ల రూపాయలకు పవన్ ను కొనుగోలు చేయబోతున్నారంటూ ఊహాగానాలు చెలరేగాయి. వీటిని కూడా పవన్ ఖండించలేదు. జగన్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని, అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని, త్యాగాలు చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయడమే లక్ష్యమని ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రెండుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. కొద్దిరోజుల నుంచి మౌనంగా ఉండటంవల్ల ఏమైనా రాజకీయ వ్యూహాలు మారుస్తున్నారా? అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications