జగన్-చంద్రబాబు పోరులో ట్విస్ట్ ! సుప్రీంచేతుల్లో 2024 ఎన్నికల అజెండా-తీర్పుతో టర్నింగ్ !
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. మరో ఏడాది దాటితే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. రెండేళ్లలో ఎలాగో ఎన్నికలు ఉంటాయి. అయితే ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, దానిపై జగన్ పెట్టుకున్న ఆశలు, టీడీపీ చేస్తున్న విమర్శలు చూస్తూనే ఉన్నాం. తాజాగా చంద్రబాబు కుప్పం టూర్ లో తాము అధికారంలోకి వచ్చాక రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని కూడా చెప్పేశారు. కానీ 2024 ఎన్నికల అజెండా ఏంటన్నది నిర్ణయించబోతోంది మాత్రం త్వరలో వెలువడే సుప్రీంకోర్టు తీర్పే.

జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు మొదలై దశాబ్దం దాటిపోయింది. మరో దశాబ్దం అయినా ఇదే పోరు కొనసాగడం కూడా ఖాయమే. అయితే వీరిద్దరి మధ్య సాగే పోరులో ఎప్పుడూ వినిపించే ఓ పదం విశ్వసనీయత. ఇదే అంశాన్ని ఫోకస్ చేస్తూ 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయం సాధించారు. జగన్ మాటిస్తే కచ్చితంగా అమలుచేస్తాడన్న ముద్ర వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అదే చంద్రబాబు హామీల విషయంలో అనుసరించిన తీరుతో జనంలో ఆ మేరకు నమ్మకం కోల్పోయారు. దీంతో 2019 ఎన్నికల అజెండాను జగన్ డిసైడ్ చేయగలిగారు. ఇప్పుడు అందరి దృష్టీ 2024పైనా నెలకొంది.

2024 అజెండా ఏంటి ?
ఇప్పుడు 2024లో ఏపీలో ఏ అంశం ఎన్నికల అజెండాగా మారబోతోందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. గతంలోలా ఇప్పుడు పరిస్దితులు లేవు. అలాగని సమస్యలకూ కొదవలేదు. కానీ రాష్ట్రం మొత్తం ఫోకస్ ను తమవైపు తిప్పుకోగలిగిన అజెండాను ఎవరు సెట్ చేస్తారు. జగనా చంద్రబాబా అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. రాజకీయాల్లో అజెండా సెట్ చేయగలిన వారే విజేతగా నిలుస్తారనే నానుడి ఉంది. దీంతో ఇప్పుడు సంక్షేమ అజెండాతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న జగన్, రెట్టింపు సంక్షేమ హామీ, శాంతిభద్రతలు, అభివృద్ధి హామీలతో చంద్రబాబు సిద్దమవుతున్నారు. అయితే ఇందులో ఏది అసలు అజెండా కాబోతోందన్నదే ప్రశ్న.

సుప్రీంకోర్టు నిర్ణయించబోతోందా ?
ఏపీలో 2024 ఎన్నికల అజెండాను జగన్, చంద్రబాబు కంటే ఎక్కువగా ఈసారి సుప్రీంకోర్టు నిర్ణయించబోతోందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు త్వరలో ఓ కీలక అంశంలో ఇవ్వబోయే తీర్పు ఏపీలో రాజకీయాల్ని ఆ స్ధాయిలో ప్రభావితం చేయడమే కాకుండా 2024 ఎన్నికల అజెండాను సైతం నిర్ణయించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అది ఉచిత పథకాల పంపిణీ. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే జగన్, చంద్రబాబు తమ అజెండాలను మార్చుకోవాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

ఏమాత్రం తేడా వచ్చినా ?
దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల్ని పంపిణీ చేసేందుకు మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఏదో విధంగా కుప్పలు తెప్పలుగా పథకాలు ప్రకటించి జనాన్ని మెప్పించి అధికారంలోకి వచ్చేస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల డబ్బు పథకాలకు ఇలా విచ్చలవిడిగా ఖర్చుపెట్టడమేంటనే ప్రశ్నతో దాఖలైన పిటిషన్ పై ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపబోతోంది. దీనిపై ఇచ్చే తీర్పు జగన్, చంద్రబాబు కంటే ముందు ఏపీ ఎన్నికల అజెండా నిర్ణయానికి కీలకంగా మారబోతోంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఉచితాలపై ఆంక్షలు పెట్టినా, పూర్తిగా ఎత్తేయాలని చెప్పినా జగన్ అజెండా పూర్తిగా మారిపోవడం ఖాయం. అలాగే సంక్షేమం కంటే అభివృద్ధినే ఎక్కువగా నమ్ముకునే చంద్రబాబుకు సైతం ఊరటనివ్వడం ఖాయం. అలా జరక్కపోతే మాత్రం జగన్ తన సంక్షేమ అజెండాతోనే ముందుకెళ్లి మళ్లీ గెలుపుబాటలు వేసుకుంటారు. చంద్రబాబు కూడా జనాన్ని సంక్షేమ అజెండాపై నమ్మించేందుకు తీవ్రంగా కష్టపడాల్సిందే. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా లెక్కలు మారిపోక తప్పదు.












Click it and Unblock the Notifications