రాములోరి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు ఎలా తయారుచేస్తారంటే?
ఏపీ, తెలంగాణలోని రామభక్తి బృందాలు 45 రోజులపాటు ఆర్గానిక్ పద్ధతిలో వరిని సాగుచేసి, వాటిని నూర్పిడి చేసి, గోటితో బియ్యంగా మార్చి కాలినడకన భద్రాచలానికి వచ్చి భక్తిపారవశ్యంతో సమర్పిస్తుంటారు
శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాములవారి కల్యాణం కనులారా చూడాలని తపించే భక్తులు దేశవ్యాప్తంగా నవమి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆరోజు స్వామివారి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలను ఉపయోగిస్తారు కాబట్టి. ఈనెల 30వ తేదీన మిథున స్టేడియం ఆవరణలో సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు భద్రాచలం శ్రీరాములవారి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కల్యాణ సమయంలో స్వామి వారికి ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. ముత్యాల తలంబ్రాలకు ఉపయోగించే బియ్యాన్ని సైతం రామభక్తులు గోటితో ఒలిచి భద్రాద్రి ఆలయానికి సమర్పిస్తుండటం ఆనవాయితీ.
ఏపీ, తెలంగాణలోని రామభక్తి బృందాలు 45 రోజులపాటు ఆర్గానిక్ పద్ధతిలో వరిని సాగుచేసి, వాటిని నూర్పిడి చేసి, గోటితో బియ్యంగా మార్చి కాలినడకన భద్రాచలానికి వచ్చి భక్తిపారవశ్యంతో సమర్పిస్తుంటారు. తలంబ్రాలు తయారుచేసే కార్యక్రమాన్ని కూడా హోలీ నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలసంఖ్యలో రామభక్తులు భద్రాచలం వస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రామభక్తులు భద్రాచలం చేరుకొని గోటి తలంబ్రాలను అధికారులకు అందజేస్తున్నారు. భక్తులు సమర్పించిన ఈ గోటి తలంబ్రాలను శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగిస్తారు.

వడ్లను స్వయంగా కోసి, నూర్పిడి చేసి, గోటితో బియ్యంగా మార్చి, పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం చేరుకొని వీటిని సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10వేల పైగా భక్తులు స్వామివారికి గోటి తలంబ్రాలను అందజేశారు. శ్రీరామచంద్రులవారికి ఐదు రాష్ట్రాల్లో మూడువేల మంది కోటి తలంబ్రాలతో ఒలిపించి కోటి తలంబ్రాలను రాజమండ్రి పుష్కరఘాట్ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సమర్పించారు. అయోధ్యలో కూడా కల్యాణం ఏర్పాటు చేయాలని, దేశమంతా రామభావన తీసుకురావాలనే తలంపుతో గత నెల 26వ తేదీన సరయు నదీ తీరంలో 108 కలశాలతో అభిషేకం చేసి అయోధ్యకు తలంబ్రాలు సమర్పించారు.












Click it and Unblock the Notifications