తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - టీటీడీ కీలక నిర్ణయాలు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు..పిల్లలకు పరీక్షలు ముగియడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. తమిళ ఉగాది..వరుస సెలవులతో రద్దీ పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా జూన్ 15 వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, కీలక నిర్ణయాల దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
తిరుమలలో వేసవి రద్దీ మొదలైంది. శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని శ్రీవారి దర్శనం కోసం కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్ల జారీ ప్రారంభమైంది. తెల్లవారుజామున మూడు గంటలకు 8వేల దివ్య దర్శన టోకెన్లు టీటీడీ అధికారులు విడుదల చేశారు. అవి పూర్తి కాగా మిగిలిన భక్తులకు మరో 4వేల టోకెన్లు విడతల వారీగా జారీ చేశారు.

టోకెన్లు పొందిన భక్తులు.. గాలిగోపురం వద్ద ఉన్న కౌంటర్‌లో స్కానింగ్ చేసుకోవాలి. పెరుగుతున్న భక్తుల రద్దీ వేళ టీటీడీ ఈ రోజు కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. ఇప్పటికే శ్రీవాణి, టూరిజం, వీఐపీ బ్రేక్ దర్శనాల తగ్గింపుపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రోజు జరిగే టీటీడీ పాలన మండలి సమావేశంలో భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు..సాధారణ భక్తులకు ప్రాధాన్యత దక్కేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేయాలని భావిస్తున్నారు. రద్దీ వేళల్లో దర్శనం టోకెన్లు ఉంటేనే తిరుమల కొండమీదకు రావాలని సూచిస్తున్నారు.అ దే సమయంలో గదుల కేటాయింపుకు సంబంధించి కీలక సూచనలు చేసారు.

తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులు రెండు గంటల ముందే సంబంధిత కార్యాలయాల దగ్గరకు వెళ్లి వారికి కేటాయించిన గదులు తీసుకుంటే వేసవిలో ఎలాంటి సమస్యలు లేకుండా తిరుమల ప్రయాణం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తు పెట్టుకుంటే వాళ్లకే మంచిదని టీటీడీ అధికారులు అంటున్నారు. వేసరి రద్దీ తగ్గేవరకూ బ్రేక్ దర్శనాల తగ్గింపు.. అటు దర్శనం..ఇటు వసతి విషయంలోనూ సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications