మద్యం టెండర్ల వేళ బిగ్ ట్విస్ట్ - చివరి నిమిషంలో..!!
ఏపీలో మద్యం టెండర్లలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దరఖాస్తులు తక్కువగా రావటంతో ప్రభుత్వం రెండు రోజుల సమయం పొడిగించింది. ఫలితంగా రెండు రోజుల్లోనే 37 వేలు రాగా.. మొత్తంగా 57,709 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు రుసుముతో రూ 1,154 కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. 2017తో పోలిస్తే ఆదాయం మూడు రెట్లు పెరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ రోజు, రేపు గడువు ఉండటంతో..మరింత పెరుగుతందని అంచనా వేస్తున్నారు. మద్యం టెండర్లలో జోక్యం చేసుకుంటున్న నేతలను సీఎం హెచ్చరించారు.
భారీగా దరఖాస్తులు
మద్యం టెండర్ల వ్యవహారంలో కీలక మలుపు. ప్రభుత్వం దరఖాస్తుల సొమ్ము ద్వారా దాదాపు రూ 2 వేల కోట్లు ఖజానాకు వస్తుందని అంచనా వేసింది. అయితే, నోటిఫికేషన్ జారీ తరువాత కూటమి నేతల జోక్యంతో పలు ప్రాంతాల్లో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. మీడియాలో కూటమి నేతల జోక్యం పైన పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది. నేతలు ఎవరైనా ఈ అంశంలో జోక్యం చేసుకుంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని సంకేతాలు పంపింది. దీంతో, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు చెక్ పడింది. మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ మొదలైంది.

పెరిగిన ఆదాయం
ప్రభుత్వం దరఖాస్తులకు రెండు రోజుల సమయం పొడిగించింది. దీంతో, సోమవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు రెండు రోజుల్లో ఏకంగా 37 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు ఫీజుల రూపంలోనే ఇప్పటికి రూ.1,154 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ మొత్తం ఈ రోజు, రేపు మరింత పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో మొదట్లో చాలా స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు అందాయి. దీనిపై ఎక్సైజ్ శాఖలోనూ ఆందోళన వ్యక్తమైంది. నేరుగా సీఎం కార్యాలయం నుంచి హెచ్చరికలు రావడంతో ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ కూడా దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌లో ఎక్కువ వెసులుబాటు కల్పించింది.
అక్కడ అదే పరిస్థితి
2017లో మద్యం పాలసీ నోటిఫికేషన్ సమయంలో అప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించింది. ఆ సమయంలో దరఖాస్తు రుసుము రూ.25 వేలు, రూ.50 వేలు రెండు రకాలుగా ఉండేది. మొత్తం దరఖాస్తులు 76,329 వచ్చాయి. రూ.473.81 కోట్ల ఆదాయం దరఖాస్తు రుసుముల ద్వారా సమకూరింది. ఇప్పుడు దానికి దాదాపు మూడు రెట్లు ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో మద్యం విక్రయాలకు ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. ఈ జిల్లాల్లో నేతల ప్రమేయం ఎలా ఉన్నా సిండికేట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో, ప్రభుత్వం మద్యం దరఖాస్తుల పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications