కడప ఫాతిమా మెడికల్ కాలేజీలో భారీ స్కాం: రోడ్డునపడ్డ విద్యార్థులు
కడప ఫాతిమా మెడికల్ కాలేజీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఎంసీఐ పర్మిషన్ లేకుండానే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చింది.
విజయవాడ: కడప ఫాతిమా మెడికల్ కాలేజీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఎంసీఐ పర్మిషన్ లేకుండానే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చింది. కాగా, త్వరలో పరీక్షలు నిర్వహించనున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాత్రం ఈ కాలేజీ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతివ్వమని తేల్చి చెప్పింది. దీంతో కాలేజీలో చేరిన వందమంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది.
కాలేజీకి టెంపరరీ పర్మిషనే ఉందని, కానీ తమకు మాత్రం పర్మిషన్ ఉందని చెప్పి కాలేజీలో చేర్పించుకున్నారని విద్యార్థులు చెబుతున్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని వచ్చామని, ఇప్పుడు పరీక్షల సమయంలో తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. మా జీవితాలు ఏం కావాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ పేపర్లలో కాలేజీకి అనుమతి ఉందని ప్రకటనలు కూడా ఇచ్చారని, అది చూసే మేం కాలేజీలో చేరామని తెలిపారు. నెల రోజుల్లో పరీక్ష ఉందనగా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వర్సిటీ అధికారులతో మాట్లాడుతున్నామని పదే పదే చెబుతున్నారని, ఇప్పుడు పరీక్షలు రాసేందుకు మాకు అనుమతి లభించడం లేదంటూ విద్యార్థులు వాపోయారు.
తాము చాలా సందర్భాల్లో కాలేజీ యాజమాన్యానికి అండగా నిలిచినప్పటికీ.. మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టిందని మండిపడ్డారు. ర్యాగింగ్, బ్యాంకింగ్ ఖాతాల పేరుతో తమతో తెల్ల పేపర్లపై సంతకాలు కూడా కాలేజీ యాజమాన్యం తీసుకుందని విద్యార్థులు తెలిపారు. తమ అడ్మిషన్లను కూడా అర్ధరాత్రి తీసుకున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఒక్కో విద్యార్థి వద్ద కాలేజీ యాజమాన్యం రూ. 50లక్షల నుంచి రూ. కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications