వరద నీటిలోనే వందలాది గ్రామాలు - పలువురి గల్లంతు : రెండు జిల్లాలో అల్లకల్లోలం..!!
భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, వందలాది గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ జిల్లాను వరద ముంచెత్తింది. 58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, 2 లక్షల 20 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు 3 లక్షల 20 వేల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో రెండు ప్రాజెక్టులు తెగిపోయాయి. చెయ్యేరు గట్లు దాటి ప్రవహించింది.

వరదల్లో కొట్టుకుపోయిన స్థానికులు
దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో 17 గ్రామాల్లోకి నీరు చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు మునిగిపోగా, కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. శనివారం సాయంత్రం నాటికి 15 మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప-తిరుపతి, కడప-అనంతపురం, కడప-నెల్లూరు, రాయచోటి-వేంపల్లెతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి.

కుంగిపోయిన పాపాగ్ని వంతెన
పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కడప- అనంతపురం రోడ్డు మార్గంలో కమలాపురం-వల్లూరు మధ్య పాపాఘ్ని వంతెన కుంగిపోయింది. రాకపోకలను నిలిపివేశారు. 50 మీటర్ల పొడవు మేరకు 2 మీటర్ల లోతుకు వంతెన కుంగింది. పెన్నా నదికి వస్తున్న వరద కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జల దిగ్బంధంలోనే ఉంది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి శనివారం 3.30 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో దామరమడుగు, వీర్లగుడిపాడు, కోలగట్ల దళితకాలనీ, పడుగుపాడు, గుమ్మళ్లదిబ్బ, పల్లిపాళెం, కుడితిపాళెం, పెనుబల్లి తదితర గ్రామాలు నీట మునిగాయి.

నెల్లూరు జిల్లాలో జల భీభత్సం
నెల్లూరు నగరంలోని తూకుమానుమిట్ట, జయలలితనగర్, అలీనగర్, అహ్మద్‌నగర్, ఉప్పరపాళెం, భగత్‌సింగ్ కాలనీని, జనార్దన్‌రెడ్డికాలనీ, వెంకటేశ్వరపురంలోని కొంతభాగం, స్టౌబీడీ కాలని తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాలను వరద చుట్టు ముట్టింది. చ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన షేక్ కరిముల్లా, అతని కొడుకు వరద నీటిలో చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని వారిని రక్షించాయి.

రైళ్ల రాకపోకలు నిలిపివేత
తిరిగి బయటకు వచ్చే క్రమంలో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ (విజయనగరం 5వ బెటాలియన్) లైఫ్ జాకెట్ తెగిపోవడంతో వరద నీటిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. నివారం మధ్యాహ్నం నుంచి చెన్నై నుంచి విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరు రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. వరద ఉధృతి తగ్గేదాకా పూర్తిగా రైళ్ల రాకపోకలను నిలిపేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ద్వంసమైన దేవాలయం
అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి, జయమంగళి, కుముద్వతి నదుల ప్రవాహం కొనసాగుతోంది. చెరువులన్నీ మరువలు పారుతున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 16 మందిని బోటు ద్వారా పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా సోమశిలలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయం పెన్నానది ప్రళయానికి ధ్వంసమైంది.