హైదరాబాద్ మెట్రో రైలుకు పచ్చజెండా: స్టే ఎత్తేసిన హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో కారిడార్ 3లో గ్రీన్ ల్యాండ్స్ నుంచి మాదాపూర్‌లోని శిల్పారామం వరకు మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపింది. ఈ మార్గంలో మెట్రో రైలు మార్గంపై 2012 మార్చి 15వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. గ్రీన్ ల్యాండ్స్, అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్ సంయుక్త కార్యాచరణ సమితి మెట్రో కారిడార్ 3 పనులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
మెట్రో రైలు మార్గం నిర్వాహకులు రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ మాల్స్ నిర్మిస్తారని, వీరికి అనుకూలంగానే ప్రాజెక్టును మార్చారని, దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. మెట్రో రైలు నిర్వాహకులు, ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించారు.

ఏపి మున్సిపల్ ట్రామ్‌వేస్ నిర్మాణం, ఆపరేషన్, మెయింటెనెన్స్ చట్టం 2008కు లోబడి నిర్మాణాలు జరుగుతాయని వీరు కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. ఈ కారిడార్‌లో మెట్రో రైలు మార్గంపై నిపుణులే నిర్ణయిస్తారని హైకోర్టు పేర్కొంది.
ఈ రూట్‌ను ఖరారు చేసే ముందు ప్రజాప్రతినిధులను చర్చించారన్నారు. మాస్టర్ ప్లాన్‌కు లోబడి మూడవ కారిడార్ మెట్రో పనులు చేపట్టవచ్చని హైకోర్టు పేర్కొంటూ స్టేను ఎత్తివేసింది. అనంతరం పిటిషన్లను డిస్మిస్ చేసింది.












Click it and Unblock the Notifications