హైదరాబాద్‌పై పేచీలు పెడుతున్నారు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పోరాటానికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాల్సి ఉంటుందని, వెయ్యేళ్లు కలిసున్నా ఎప్పుడో ఒకసారి విడిపోక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని అంటూ అడ్డుకోకుండా అందరూ సహకరించాలని ఆయన కోరారు. విడిపోయినంత మాత్రాన శత్రువులై పోరని, అందరూ కలిసి మెలిసి జీవించవచ్చని ఆయన అన్నారు.
శనివారం హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా రాజీవ్ స్మారక కమిటీ అధ్యక్షుడు జి.నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జైపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలైన తర్వాత కూడా సద్భావన, సయోధ్యతో తెలుగు ప్రజలు కలిసుంటారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ ఇవ్వదు గాక ఇవ్వదంటూ వ్యతిరేకం గా ప్రచారం చేస్తూ అప్రతిష్టను అంటగట్టాయని, కానీ సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని చెప్పారు.

పరిపాలనలో, అభివృద్ధిలో వివక్షను తొలగించాలన్న లక్ష్యంతో తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతిస్తామని 2009 ఆగస్టులో చంద్రబాబు, తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని వైఎస్సార్‌సీపీ ప్రకటించాయని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సబబని జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నవారి అనుమానాలను తొలగించడాని కి తాము సిద్ధంగాఉన్నామని అన్నారు. హైదరాబాద్‌పై కొందరు పేచీలు పెడుతున్నారని, ఇది ఎవరి సొత్తూ కాదని, అందరిదని స్పష్టం చేశారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రజలే కాకుండా దేశంలోని ఎన్నో ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని అన్నివర్గాలూ సద్భావనతో మెలగాలని అన్నారు. దేశంలో అస్థిర పరిస్థితులను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే బీజేపీకి ఎన్నికల సమయంలోనే రామజన్మభూమి, రామ మందిరం గుర్తుకు వస్తుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications