హైదరాబాద్ చండీగడ్ కాదు, చాలా దూరం: బాబు
న్యూఢిల్లీ: హైదరాబాద్ చండీగఢ్ కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన అభివర్ణించారు. చండీగఢ్ మాదిరి హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ఉంచలేమని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర హైదరాబాద్‌కు కనీసం 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. అందువల్ల కొత్త రాజధాని నిర్మించాల్సి ఉంటుందని, హైదరాబాద్ వంటి రాజధాని కావాలంటే కనీసం 20నుంచి 30 ఏళ్లు పడుతుందని, ఇందుకు నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతాయన్నారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీలో విదేశీ జర్నలిస్టుల క్లబ్‌లో దాదాపు గంటన్నర సేపు విదేశీ పత్రికల ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హైదరాబాద్ నగర నిర్మాతను తానేనని, అయితే విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణలో ఉన్నందు వల్ల సీమాంధ్రలో రాజధానితోపాటు అనేక నగరాలను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తనదీ మోడీది ఒకే కెమిస్ర్టీ అని, అదే అభివృద్ధి అని చంద్రబాబు చెప్పారు. ఇద్దరికీ అభివృద్ధి తప్ప మరే ఆలోచన లేదన్నారు.

అందుకే కొత్త రాజధాని నిర్మాణానికి మద్దతునీయాల్సిందిగా తాను ప్రధానిని కోరానని చెప్పారు. తెలంగాణలో ఉన్నప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని కాపాడాల్సి ఉందని, ఆ ప్రతిష్టను హైదరాబాద్ కోల్పోవడాన్ని తాను చూడదలుచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేదని, శాస్త్రీయ ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించారని ఆయన చెప్పారు.
రెండురోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ ఇచ్చినప్పటికీ తమకు ప్రయోజనాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజల వివేకాన్ని తక్కువ అంచనా వేసి అటు జాతీయస్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నదన్నారు. విభజన నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో కోల్పోయిందని, కనీసం విద్యాసంస్థలు కూడా తమ రాష్ట్రంలో లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అంశానికీ ఇరు రాష్ట్రాలు పోట్లాడుకోవడం మంచిది కాదని భావించి ఇటీవల కేసీఆర్‌తో సమావేశమయ్యానన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలుసుకుంటానని అమెరికా రాయబారిని కోరానని, అయితే, క్లింటన్ ఉప జాతీయ నేతలను ఎవర్నీ కలుసుకోబోరని అక్కడి నుంచి తనకు సమాధానం వచ్చిందని చంద్రబాబు చెప్పారు. కానీ క్లింటనే స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి తనను ఆశ్చర్యపరిచారని తెలిపారు. హైదరాబాద్ గురించి పత్రికల్లో చదివానని, ఎప్పుడు ఇండియా వచ్చినా హైదరాబాద్ రావాలనుకున్నానని క్లింటన్ తనతో చెప్పారని తెలిపారు.
తాను అప్పటికప్పుడు కంప్యూటరైజ్డ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను క్లింటన్‌కు ఇచ్చానని, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి మురిసిపోయిన క్లింటన్ అమెరికాలో గవర్నర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌కు వెళ్లమని ఆయన బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు కూడా సలహా ఇచ్చారని ఈ రకంగా హైదరాబాద్‌కు క్లింటనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా 2025 వరకు విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2022 నాటికి దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలపడం, 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని తెలిపారు.












Click it and Unblock the Notifications