నిద్ర: బస్‌లో పిస్టల్, బుల్లెట్లు పోగొట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే గన్‌మెన్
కడప/హైదరాబాద్: పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గన్‌మెన్ తన పిస్టల్ పోగొట్టుకున్నారు. ఆదివారం నాడు చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా అతను బస్సులో ఈ పిస్టల్‍ను, దాంతో పాటు పది బుల్లెట్లను పోగొట్టుకున్నారు.
అతను బస్సు ఎక్కిన తర్వాత నిద్రపోయాడు. ఆ తర్వాత లేచి చూసుకునేసరికి జేబులో ఉండాల్సిన పిస్టల్, బుల్లెట్లు కనిపించలేదు. హైదరాబాదులో బస్సు దిగిన అనంతరం అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హైదరాబాదులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం తిరుపతి నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు చిత్తూరు ఏఆర్ విభాగానికి చెందిన గౌస్ సాహెబ్ గన్‌మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్యే విమానంలో బయలుదేరగా.. గన్‌మెన్ శనివారం రాత్రి బస్సులో హైదరాబాదు బయలుదేరాడు. పలమనేరులోనే హైదరాబాదు బస్సెక్కిన అతను... బస్సు ఎక్కీ ఎక్కగానే నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర మత్తులోనే తాను కూర్చున్న సీటు నుంచి మరో సీటుకు మారాడు.
సీటు మారుతున్న క్రమంలో అతడు తన పిస్టల్, బుల్లెట్లను చూసుకోలేదు. అయితే ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిద్ర లేచిన గన్‌మెన్ జేబులో చూసుకునేసరికి పిస్టల్, బుల్లెట్లు కనిపించలేదు. దీంతో బస్సు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు అతడు సమాచారాన్ని చేరవేశాడు.












Click it and Unblock the Notifications