నేనూ బాధితుడినే: చంద్రబాబు, కాన్వాయ్ లేకుండా ప్రయాణం
గుంటూరు: రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను ఆయన గురువారంనాడు సందర్శించారు. వారిద్దరూ ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు.
భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటే...తాము ఇక్కడ ఉండాల్సి వస్తోందని ఓ ఉద్యోగి వారితో అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి - అవును, రాష్ట్ర విభజన గాయాలు నాకూ తగిలాయి. నేనూ బాధితుడినే. నా భార్య హైదరాబాద్‌లో.. నేను ఇక్కడ ఉంటున్నామని నవ్వుతూ అన్నట్లు సమాచారం.
ఇదిలావుంటే, కాన్వాయ్ లేకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించటం అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గురువారం చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో కలసి రాజధానిలో అయినవోలు, శాఖమూరు గ్రామాల మధ్య ఏర్పాటు కానున్న విట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఉదయం 10.30 గంటలకు హెలీకాప్టర్‌లో చేరుకోవాల్సి ఉండింది.

చివరి నిమిషంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని సందర్శించాలని చంద్రబాబు వెంకయ్యను కోరారు. దీంతో షెడ్యూల్ మారింది. అప్పటికప్పుడు నిర్ణయించిన కార్యక్రమం కావడంతో ఇద్దరూ ఉండవల్లిలోని సిఎం నివాసం నుంచి లోకేష్ కారులో వెలగపూడికి బయల్దేరారు.
ముఖ్యమంత్రి కాన్వాయి అప్పటికే శంకుస్థాపన ప్రాంతం వద్దకు చేరుకుంది. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. సచివాలయంలో సదుపాయాలు, ఉద్యోగుల సాధకబాధకాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరాతీశారు.
సొంత రాష్ట్రంలో పనిచేయటం తమకు ఆనందంగా ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘంనేత మురళీకృష్ణ తెలిపారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే సచివాలయ భవనాలను నిర్మించి పాలనా యంత్రాంగాన్ని తరలించటంలో చంద్రబాబు కృషి ప్రశంసనీయమని అన్నారు.












Click it and Unblock the Notifications