pawan kalyan janasena jana sena andhra pradesh lok sabha elections 2019 amaravati పవన్ కళ్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు అంటే తనకు తెలుసునని, రాజకీయాలు అంటేనే బురద అని, అందులోకి దిగి దానిని శుభ్రం చేయాలని పవన్ చెబుతున్నారు.

జనసేనలోకి వచ్చేవారు మారాలి
ఈ నేపథ్యంలో పలు పార్టీల నుంచి నేతలను జనసేనలోకి తీసుకుంటున్నారు. ఆయా పార్టీల్లో వారు ఎలా ఉన్నప్పటికీ జనసేనలోకి వచ్చేసరికి వారిలో మార్పు కనిపించాలని, అవినీతి-అక్రమాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన కార్యకర్తలు, అభిమానులతో చెబుతున్నారు. రాజకీయాలు అంటే అందరూ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటే అది అతి అవుతుందని, కానీ మన పార్టీలోకి వచ్చాక వారిలో మార్పు రావాలని చెబుతున్నారు.

పుల్లారావుపై జనసేనాని ప్రశంసలు
పార్టీలో యువతకు, సీనియర్ రాజకీయ నాయకులకు చోటు కల్పించడంతో పాటు రాజకీయ వ్యూహాలు రచించగల మేథావులు, ఏ మచ్చా లేనటువంటి నేతలను కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా పెంటపాటి పుల్లారావును ఆయన జనసేనలోకి ఆహ్వానించారు. పెంటపాటి పుల్లారావు ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు. ఆయనపై జనసేనాని ప్రశంసలు కురిపించారు. ఆయనను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన రాస్తున్న కథనాలు విశ్లేషణాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయన్నారు.

పుల్లారావు
ఇటీవల ఓసారి తాను పుల్లారావును కలుసుకున్నాననీ, తాము ఇద్దరం కొద్ది గంటల పాటు ఒకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన లాంటి కొత్త పార్టీకి పుల్లారావులాంటి అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వం అవసరముందని చెప్పారు. జనసేనలో చేరాల్సిందిగా తాను పుల్లారావును ఒప్పించాననీ, ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో... జనసేనపై పుల్లారావు రాసిన ఓ కథనం క్లిప్‌ను జత చేశారు.