అప్పుడే ఓట్లడుగుతా: టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల ఆసక్తికరం
అనంతపురం జిల్లాలోని పెద్దకోట్ల దిగువకాలనీలో పర్యటించిన సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: జిల్లాలోని పెద్దకోట్ల దిగువకాలనీలో పర్యటించిన సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ గ్రామానికి తారురోడ్డు వేయిస్తానని.. గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చానని అక్కడి ప్రజలకు గుర్తు చేశారు.
అంతేగాక, ఆ హామీలను నెరవేర్చనిదే మళ్లీ మీ వద్దకు వచ్చి ఓట్లు అడగనని ఎ మ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రజలతో అన్నారు. సీబీఆర్‌లో నీటిమట్టాన్ని పరిశీలించిన అనంతరం తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యేను పెద్దకోట్ల దిగువకాలనీకి చెందిన మహిళలు ఆయన్ని కలిశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మహిళల్ని చూసి ఎమ్మెల్యే పలుకరించారు.

ఏమైనా సమస్యలున్నాయా? అంటూ ఆరా తీశారు. నీటి సరఫరా సరిగా లేదని తెలుపడంతో ఒక పంపు రిపేర్ ఉందని, రెండు రోజుల్లోపు రిపేర్ చేయించి సక్రమంగా నీటిని సరఫరా చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామానికి రోడ్డు వేయించాలని వారు కోరగా.. ఈ హామీని ముందుగానే మీకు ఇచ్చానని, దానిని నెరవేర్చే మళ్లీ మీ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతానని ప్రజలకు స్పష్టం చేశారు.
కాగా, గ్రామానికి చెందిన సూరయ్య అనే వృద్ధుడికి ఆరోగ్యం సరిగా లేదని తెలియడంతో రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు ఎమ్మెల్యే గోనుగుంట్ల.












Click it and Unblock the Notifications