బాబులా నా వల్ల కాదు, నిలదీయండి: దులిపేసిన జగన్
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులా అబద్దాలు అడటం తన వల్ల ఏమాత్రం కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే బాబు అబద్దపు హామీలిస్తున్నారన్నారు. మన రాష్ట్ర బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లయితే.. రూ.1.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, మద్యపాన నిషేధంను ఎత్తివేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు.

ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా, ఢిల్లీకి సాగిలపడే ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు మోడీకి ఓటు వేయమంటున్నారని, తాను తెలుగుజాతి భవిష్యత్ కోసం ఓటు వేయమంటున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రం దశ-దిశ మార్చే ఆరు పనులు చేస్తానని హామీయిచ్చారు.
చెప్పిన పనులే కాకుండా.. చెప్పనవి కూడా చేస్తానన్నారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత పునరుద్దరించాల్సి ఉందన్నారు. చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇప్పుడుస్తున్న వాటిని ఎందుకు చేయలేదన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు ఓ మాట, ఎన్నికలయ్యాక మరో మాట మాట్లాడుతారన్నారు.
ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సి ఉందన్నారు. బాబు మాదిరి విశ్వసనీయత లేని రాజకీయాలు తాను చేయనని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే రాష్ట్ర ప్రగతిని మార్చే సంతకాలు చేస్తానని చెప్పారు. విశ్వసనీయతకు ఓటేస్తే.. తాను స్వర్ణయుగం తీసుకు వస్తానని చెప్పారు. టిడిపిని సీమాంధ్ర నుండి తరిమి కొట్టాలన్నారు.












Click it and Unblock the Notifications