జగన్ కేసు: మీతో విసిగిపోయాను.. ఇంకెంత కాలమిలా? లాయర్ పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం
అక్రమాస్తుల కేసులో శుక్రవారం వైఎస్ జగన్ కోర్టుకు హాజరుకాగా, జగన్ తరఫున వాదిస్తోన్న న్యాయవాదిపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. ‘రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారు.
Recommended Video

హైదరాబాద్: వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగు చార్జిషీట్లపై డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.
దీంతో.. ''రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారు. మీ తీరుతో విసిగిపోయా! ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారు? అనవసరమైన విషయాలతో రోజుల తరబడి వాదనలు వినిపిస్తున్నారు. నా 30 ఏళ్ల సర్వీసులో ఎక్కడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు. ఇక నుంచి ఇలా కుదరదు..' అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

ఆ చార్జిషీటును పక్కన పెట్టాలంటూ...
సీబీఐ దాఖలు చేసిన సీసీ 9కేసు చార్జిషీటును పక్కన పెట్టాలంటూ జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపించేందుకు సిద్ధమవుతుండగా... జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కల్పించుకున్నారు. 8, 10, 14 చార్జిషీట్ల డిశ్చార్జ్ పిటిషన్లను కూడా కలిపి విచారించాలని ఆయన కోరారు. ఇందుకు అనుమతిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే దీనిపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో తనకు తెలుసని అంటూ వాదనలు వినిపించాలని సీబీఐ తరఫు స్పెషల్ పీపీ సురేందర్‌ను ఆదేశించారు.

బెదిరించి పెట్టుబడులు పెట్టించారు...
వైఎస్ జగన్, సాయిరెడ్డి కుమ్మక్కై అనేక కంపెనీలను ఏర్పాటు చేశారని, తీసుకోవాల్సిన లంచాలను పెట్టుబడుల రూపంలోకి మళ్లించారని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ వాదించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా (ట్రబుల్ ఫ్రీ) వ్యాపారం చేసుకోవాలంటే పెట్టుబడులు పెట్టాల్సిందేనని సాయిరెడ్డి బెదిరించినట్లుగా ఓ సాక్షి న్యాయమూర్తి ఎదుట సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారని స్పెషల్ పీపీ తెలిపారు. ‘ఈ కేసును నిరూపించేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని... దశల వారీగా విచారిస్తే కుట్రను నిరూపించగలం. డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయండి..' అని సురేందర్ కోర్టును కోరారు.

సాయిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ కాదుగా...
అయితే... సాయిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ హోదాలోకి రారని, అందువల్ల కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందా? లేదా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి సీబీఐ లాయర్‌కు సూచించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ జగన్ కంపెనీల్లో రాంకీ ఫార్మా పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లపై న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తదుపరి వాదనలు 24న కొనసాగనున్నాయి.

పాదయాత్రకు విరామం.. కోర్టులో ప్రత్యక్షం...
శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు నిమిత్తం హాజరుకావలసి ఉండడంతో వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో ‘ప్రజా సంకల్పం' పాదయాత్రకు విరామం ఇచ్చారు. జగన్ కోర్టుకు హాజరైన సందర్భంగా పెద్దసంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా కోర్టుకు తరలివచ్చారు. వారందరినీ బయటకు పంపేందుకు కోర్టు సిబ్బంది తంటాలుపడ్డారు. సాయంత్రం 4.30 వరకు జగన్ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు జగన్‌ను కలిసి కొద్దిసేపు చర్చించారు. చోటామోటా నాయకులు, కార్యకర్తలు కోర్టుకు రావడంపై జగన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications