ఇది చాలు.. ఇకపై: సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి..!!
అమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తూ వస్తోన్న ఆయన ఇప్పుడు రూటు మార్చారు. గతంలో గాడ్ ఫాదర్ విడుదలప్పుడు బాహటంగా- పవన్ కల్యాణ్ కు మద్దతును ప్రకటించారాయన. జనసేన పార్టీ పేరును ప్రస్తావించకపోయినా- పవన్ కే తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్ కల్యాణ్ ను చూస్తామంటూ చిరంజీవి అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్ ప్రణాళికపై..
ఇక తాజాగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనే విషయాన్ని చిరంజీవి స్పష్టం చేశారు. సామాజిక కార్యక్రమాల పట్ల దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. దశాబ్దాల కిందటే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లను నెలకొల్పారు చిరంజీవి. దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరింపజేశారు. ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా చాలామందికి కొత్త జీవితాలను ప్రసాదించారు. గత సంవత్సరం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సమయంలో తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆ సమయం..
ఇక మున్మందు కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరింపజేయాలని భావిస్తోన్నట్లు చిరంజీవి తేల్చి చెప్పారు. పూర్తిస్థాయిలోో సామాజిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తాను దేవుడిని ఎంతో నమ్ముతానని, ఊహించిన దాని కంటే ఎక్కువే ఇచ్చాడని చెప్పారు. తాను పొందిన దాంట్లో నుంచి ఇక సమాజానికి వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.

నటసామ్రాట్ రీమేక్..
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న రంగమార్తాండ సినిమాలో వచ్చే నేనొక నటుణ్ని.. అనే షాయరీకి చిరంజీవి తన గళాన్ని అందించారు. నట సామ్రాట్ అనే మరాఠీ సినిమాకు రీమేక్ ఇది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన ఈ సినిమాలో నానా పటేకర్ లీడ్ క్యారెక్టర్ ను పోషించారు. రంగమార్తాండ పేరుతో ఈ మూవీని రీమేక్ చేస్తోన్నారు కృష్ణ వంశీ. నానా పటేకర్ రోల్ ను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తోన్నారు.

నటుడిగా..
ఇందులో నేనొక నటుణ్ని.. అనే షాయరీకి చిరంజీవి గళాన్ని అందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవంశీతో తను అనుభవాన్ని పంచుకున్నారు. ఈ షాయరీ తనను కదిలిచిందని, ఓ నటుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నట్టయిందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించనప్పటికీ- ఈ షాయరీ ద్వారా ఆ లోటు తీరినట్టయిందని వ్యాఖ్యానించారు. గోవిందుడు అందరి వాడేలే సినిమాతో రామ్ చరణ్ కు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు.

ఇక చాలు.. ఇక తిరిగి ఇస్తా..
తాను దేవుడిని నమ్ముతానని చిరంజీవి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడీ స్థానంలో ఉండటానికి భగవంతుడి ఆశీర్వాదంతో పాటు ప్రజలు, సమాజం కూడా కారణమనీ అన్నారు. తన కుటుంబం కూడా ఉన్నత స్థానంలో ఉందని, ఎవరికైనా ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పారు. ఇప్పటివరకు తాను పొందింది చాలని, దశాబ్దాల కాలం పాటు తనకు అండగా నిలిచిన ఈ సమాజానికి ఇకపై తిరిగి ఇచ్చేస్తానని చిరంజీవి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications