లేఖపై కిరణ్ అడిగారు, కుదరదన్నా: స్పీకర్ నాదెండ్ల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)పై చర్చకు గడువు పెంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు సూచించారని, అయితే తాను కుదరదని చెప్పానని శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. గురువారం జరిగిన శాసనసభా సంప్రదింపుల కమిటీ (బిఎసి) సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు.
సభా నాయకుడిగా తమను సంప్రదించుకుండా బిల్లుపై చర్చకు గడువు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలా లేఖ రాస్తారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా అదే ప్రశ్న వేసింది.

గడువు పెంచాలని తాను లేఖ రాయడానికి నిరాకరించానని, సభలో ఏకాభిప్రాయం లేకపోవడంతో తాను అందుకు నిరాకరించానని, ముఖ్యమంత్రే ఆ లేఖ రాశారని స్పీకర్ చెప్పారు. బిల్లులోని క్లాజులపై ఓటింగ్ ఉండాలని, బిల్లుపై తీర్మానం ఉండాలని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు అశోక్ గజపతి రాజు కోరారు. అయితే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యతిరేకించారు. అశోక్ గజపతి రాజు తమ నాయకుడు కారని, ఆ మాట వినాల్సిన అవసరం లేదని దయాకర్ రావు అన్నారు.
బిఎసిలో చర్చించిన తర్వాతే ఓటింగు, తీర్మానంపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు కోరారు. చర్చ పూర్తయ్యే వరకు తీర్మానం నోటీసులు తీసుకోవద్దని తెరాస, మజ్లీస్ నేతలు సూచించారు. అయితే, తాను సభా సంప్రదాయాల ప్రకారమే నడుచుకుంటానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో గురువారం బిఎసి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ వరకు శాసనసభా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రసంగాన్ని కొనసాగించకపోవడం ఆశ్చర్యకరమని అక్బరుద్దీన్ అన్నారు.












Click it and Unblock the Notifications