నేను వెళ్లను, కేసీఆర్‌ను కలవొచ్చు: 'తలసాని'పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తాను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ప్రసక్తి లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు గురువారం స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవడం, తాము తెరాసలో చేరుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర రావు స్పందించారు. తాను తెరాసలో చేరనని తెలిపారు. టీడీపీ నేతలను మభ్యపెట్టి తెరాస పార్టీలోకి చేర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, మరింత బలపడుతోందని, ఈ భయంతోనే తెరాస వలసలను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు.

తాను ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవటంలో తప్పులేదని, ప్రజా సమస్యల కోసమే మిగతా ఎమ్మెల్యేలు కలిసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
వైరా ఎమ్మెల్యేపై అనర్హత వేటుకు...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైరా ఎమ్మెల్యే పైన ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. వైరా ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని వారు ఫిర్యాదు చేయనున్నారు.












Click it and Unblock the Notifications