విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు అరుదైన గుర్తింపు
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రకాశం బ్యారేజ్‌నుమప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. దీనికి సంబంధించి ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు లేఖ రాశారు. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు, ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే ఉద్దేశంతో సంస్థ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది.
అవార్డుల ఎంపికకు నామినేషన్లు కోరగా వచ్చిన వాటిలో 19 నిర్మాణాలను ప్యానల్ జడ్జిలు సిఫార్సు చేశారు. భారత్ నుంచి నాలుగు నిర్మాణాలను అవార్డుకు ఎంపిక చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ తోపాటు ఒడిశాలోని బలిద్హిహా ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు, తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఎంపికయ్యాయి. నవంబరు 2 నుంచి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే ఓ కార్యక్రమంలో వీటిని అందజేస్తారు.

ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ మన రాష్ట్రంలో మొత్తం ఐదు ప్రాజెక్టులను గుర్తించింది. కేసీ (కర్నూలు-కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై వీరు అధ్యయనం చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ కు అరుదైన గుర్తింపు దక్కడంపై నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications