టీ బిల్లు ఆగితే సీమాంధ్రలో హీరో ఎవరు? (పిక్చర్స్)
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకపోతే సీమాంధ్రలో హీరో ఎవరు అవుతారనే విషయంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. బిల్లు ఆమోదం పొందకపోతే దానికి బిజెపి మాత్రమే కారణమవుతుంది. కాంగ్రెసుకు తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే చిత్తశుద్ధి లేదని బిజెపి ఎంతగా వాదించినా ఆ విషయం తెలంగాణ ప్రజలకు పట్టే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పొత్తు కోసం తెలంగాణ బిల్లును బిజెపి అడ్డుకుందనే అభిప్రాయం బలంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ పరిస్థితిలో తెలంగాణలో బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఫలితం ఉండకపోవచ్చు.
తెలంగాణలో కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేస్తే ఇతర పార్టీలకు చోటు ఉండే అవకాశం లేదు. కాంగ్రెసు దీనికోసం ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే, కాంగ్రెసు మాత్రం వ్యూహాత్మకంగా బిజెపిని ఒత్తిడికి గురిచేసింది. అయితే, తెలంగాణ బిల్లు ఆమోదం పొందకపోతే సీమాంధ్రలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

కిరణ్ కుమార్ రెడ్డి ఇలా..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర హీరో కావాలని తెగ ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోతే కాంగ్రెసు నాయకులంతా కలిసి ఆయనను హీరోగా చేసే అవకాశం ఉంది.

కావూరికి ప్లస్ పాయింట్స్
తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గకపోతే సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుకు కూడా ప్లస్ మార్కులు పడుతాయి. మంత్రిగా ఉంటూ ప్రతి దశలో తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించారనే భావన ఆయనకు కలిసి వస్తుంది.

లగడపాటి రాజగోపాల్ కూడా..
పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లడపాటి రాజగోపాల్ హీరోగా అవతరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయనతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి మిగతా పార్లమెంటు సభ్యులకు కూడా మంచి మార్కులు పడుతాయి.

వైయస్ జగన్ పోటీ..
సీమాంధ్రలో ఇతర పార్టీలను చిత్తు చేయడానికి నడుం బిగించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. అటు కాంగ్రెసు నుంచి ఇటు తెలుగుదేశం నుంచి ఆయన పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు.

చంద్రబాబు నాయుడికి ఇలా..
ప్రస్తుత తెలంగాణ వివాదంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే కొన్ని ప్లస్ మార్కులు పడ్డాయి. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకపోతే అదంతా ఆయనకు కలిసి వస్తుందా అంటే చెప్పడం కష్టమే.
కాంగ్రెసు తెలంగాణ బిల్లును తెచ్చి రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నించిందనే అపవాదు ఉన్నప్పటికీ తాము తెలంగాణను ఆపగలిగామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా ఇతర సీమాంధ్ర నాయకులు జోరుగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు పార్లమెంటు సభ్యులను తిరిగి కాంగ్రెసు అధిష్టానం చేరదీసే అవకాశాలు కూడా లేకపోలేదు. వీరు సీమాంధ్రకు సంబంధించి హీరోలుగా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఆరుగురు పార్లమెంటు సభ్యుల్లో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి తామే ఆపామనే ప్రచారాన్ని ముమ్మరంగా చేసుకుంటారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుకు కూడా మార్కులు పడుతాయి. అందువల్ల కాంగ్రెసు సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏమీ ఉండదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తామే ఆపగలిగామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెప్పుకునే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. తాము తెలంగాణ ప్రాంతాన్ని వదులుకుని సమైక్యాంధ్ర కోసం పనిచేశామని ఆయన చెప్పుకుంటారు. ఆయన సమైక్యాంధ్ర హీరోగా ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
కాగా, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆగిపోతే తెలుగుదేశం బిజెపితో కలిసి సీమాంధ్రలో ఆధిపత్యం సాధిస్తుందా అనేది చెప్పలేం. ఒకవేళ, ఎన్నికల లోపు తెలంగాణ ఏర్పడకపోతే అందుకు ప్రధాన కారణం బిజెపి, తెలుగుదేశం పార్టీలే అవుతాయి. అయినా, దాన్ని సీమాంధ్రలో తమకు అనువుగా మార్చుకునే అవకాశం ఆ పార్టీలకు ఉంటుందా అనేది చెప్పలేం.












Click it and Unblock the Notifications