
మంత్రి గంటాకు గోల్డ్ మెడల్ స్టూడెంట్ షాక్: సీనియర్ల సలహాలు,నా కృషి వల్లే...గురువుల ఘనతేం లేదు
నూజివీడు: ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఊహించని షాక్ తగిలింది. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ పొందిన ఒక విద్యార్థి మంత్రి గంటాకు ఈ షాక్ ఇచ్చారు.
నూజివీడు ఆర్‌జీయూకేటీ 3వ కాన్వొకేషన్ సందర్భంగా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్స్ గెల్చుకున్న విద్యార్థులకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బంగారు పతకాలను అందజేశారు. అనంతరం అక్కడి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకునేందుకు అక్కడకి వెళ్లారు. అయితే అంతకుముందే మంత్రిగారి చేతుల మీదుగా బంగారు పతకం పొందిన శివకుమార్ అనే ట్రిపుల్ ఐటి విద్యార్థి మంత్రి ని అనుసరిస్తూ ఆయన వెనుకే అక్కడకు చేరుకున్నాడు. ఆ తరువాత విద్యార్థి చెప్పిన విషయం విని మంత్రి గంటా అవాక్కయ్యారు.

ఇందులో మా గురువుల ఘనతేం లేదు...
తాను గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థిగా మంత్రికి పరిచయం చేసుకున్న ఆ విద్యార్థి మంత్రితో...సర్..నాకు ఈ గోల్డ్‌మెడల్ మా అధ్యాపకుల బోధన వల్ల రాలేదు. సీనియర్లు ఇచ్చిన సలహాలను పాటించి...పక్కా ప్రణాళికతో కష్టపడి, చదవడం వల్ల వచ్చింది...మా ట్రిపుల్ ఐటినే కాదు రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో విద్యాబోధన చాలా లోపభూయిష్టంగా ఉందని...ఆ విషయమే మీకు తెలియచెబుదామని వచ్చాను...అనడంతో మంత్రి గంటా ఖంగు తిన్నారు. మీరైనా విద్యార్థులను తీర్చిదిద్దేలా ఈ సంస్థల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని సూచించమని ఆ విద్యార్థి మంత్రి గారిని కోరాడు. ఈ విద్యార్థి మాటలతో దిగ్ర్భాంతికి గురైన మంత్రి గంటా...ఆ విద్యార్థి శివకుమార్ ఇంకా ఏదో చెప్పబోతుండగా వారించారు.

ఇక్కడొద్దు...ఫోన్ లో...పర్సనల్ గా మాట్లాడు...
ఇప్పుడు కాదు...ఇక్కడొద్దు...నా పర్సనల్ నంబర్ నీకు ఇస్తున్నా...నాతో తరువాత ఫోన్‌లో మాట్లాడమని చెప్పి గోల్డ్ మెడల్ స్టూడెంట్ శివకుమార్‌కు మంత్రి గంటా తన నంబరు ఇచ్చి పంపించారు. మంత్రితో జరిగిన ఈ స్టూడెంట్ సంభాషణను విన్నకొందరు మీడియా ప్రతినిధులు అతన్ని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా మీడియాతో మాట్లాడేందుకు శివకుమార్ నిరాకరించాడు.

ఖంగుతిన్న...నూజివీడు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం...
అయినా ఈ విషయాలు మీడియాలో రావడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఖంగుతింది. దీంతో శివకుమార్ తమ క్యాంపస్ విద్యార్థి కాదని, ఆర్కేవ్యాలీ (ఇడుపులపాయ) నుంచి వచ్చాడని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సీరియస్ గా తీసుకున్న...మంత్రి గంటా...
అయితే గోల్డ్ మెడల్ స్టూడెంట్ శివకుమార్ తన దృష్టికి తెచ్చిన విషయాలపై మంత్రి గంటా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీల్లోని పరిస్థితులపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలకు సంబంధించి శివకుమార్ చెప్పిన విషయాలు గతంలో కూడా తన దృష్టికి వచ్చాయని, వీటిలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామకాల తీరుపై ఆరోపణలున్నాయని మంత్రి గంటా తెలిపారు. ఇందులోని వాస్తవాలు లోతుగా తెలుసుకునేందుకే ఆ విద్యార్థికి తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చినట్లు మంత్రి గంటా వివరించారు.

విద్యావ్యవస్థ పతనమైతే...దేశం నాశనం...
విద్యావ్యవస్థ పతనమైతే దేశం నాశనం అయిపోతుందని మంత్రి గంటా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. "గతంలో ఏ దేశాన్నయినా నాశనం చేయాలంటే ఆటంబాంబు ప్రయోగించేవారు. ఇప్పుడు విద్యావ్యవస్థ పతనమైతే చాలు.. ఆటం బాంబు పేలినంత అనర్థం జరిగిపోతుంది" అని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అందుకే ఎపి ప్రభుత్వం బడ్జెట్‌లో 15శాతం నిధులను విద్య కోసమే ఖర్చుపెడుతోందని వివరణ ఇచ్చారు.