బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..
కరోనా వైరస్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి నేఫథ్యంలో విధించిన లాక్ డౌన్ ను సొమ్మచేసుకుంటూ కొందరు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు ఇవాళ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కరోనా వైరస్ కారణంగా విజయవాడ నగరంలో రెడ్ జోన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే నిత్యావసర సరుకుల రవాణాకు అనుమతి ఉంది. కానీ కొందరు అక్రమార్కులు బ్యాంక్, మెడికల్, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లను వాడుకుంటూ ఎంచక్కా మిగతా సమయాల్లోనూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో తన వాహనంపై ఓ ప్రైవేటు బ్యాంక్ స్టిక్కర్ వేసుకుని మద్యం అక్రమ సరఫరా చేస్తున్న వ్యక్తిని గవర్నర్ పేట పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలో లిక్కర్ మాఫియా వ్యవహారం వెలుగుచూసింది.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్లో రేపటి నుంచి సడలింపులు అమల్లోకి రానున్నాయి. అయితే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. రెడ్ జోన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
అయితే రెడ్ జోన్లో ఉన్న విజయవాడ నగరంలో ఇప్పట్లో మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే మద్యాన్ని అక్రమంగా బయటికి తెచ్చి బ్లాక్ లో అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మద్యే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించి స్టాక్ లెక్కలను పరిశీలించారు.