ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒక వైపు ఎండ.. మరో వైపు వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా, తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. ఈ నెల 27న కేరళకు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది.
మారుతున్న వాతావరణం
ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 27న రుతు పవనాలు కేరళ తాకనుండటంతో పాటుగా వర్షాలు బాగా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత 20 ఏళ్లలో 2015లో మినహా 2005-2024 మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు తప్పలేదు. తాజా అంచనా ప్రకా రం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనున్నది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకనున్నాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటి నుంచి ఏపీలో వాతావరణం మారుతుంది.

విస్తారంగా వర్షాలు
జూన్ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ముందే రుతుపవనాలు రానున్నందున వచ్చే నెల రెండో వారం నుంచే వర్షాలు పుంజు కునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ (104 శాతం) వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక, రాష్ట్రంలో ఆదివారం 41-43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి జిల్లాలో 11 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 8 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, అల్లూరి, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 30 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.
రానున్న రెండు రోజులు
మరోవైపు అక్కడక్కడా పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం 24 మండలాల్లో తీవ్రంగా, 57 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం తిరుపతి జిల్లా రేణిగుంలో 41.7 డిగ్రీలు, విజయనగరంలో 41.1, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41, అన్నమయ్య జిల్లా కంభాలకుంటలో 40, కడప జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications