అకాల వర్షాలు.. అల్లకల్లోలం - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న వేళ.. అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వర్షాలతో ఇబ్బందులు తప్పటం లేదు. పలు ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. అటు రుతుపవనాల కదలిక లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సమయంలోనే వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రికార్డు ఉష్ణోగ్రతలు.. వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల్లోని సుమారు 95 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటినట్లు అధికారులు వెల్లడించారు. మరో 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని తాజా బులెటిన్ లో హెచ్చరించారు. కాగా.. కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 45 నుండి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అటు తెలంగాణలో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. వడదెబ్బకు పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతోంది.

విస్తరిస్తున్న రుతుపవనాలతో
ఈ రికార్డు ఉష్ణోగ్రతల వేళ పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షాలు, పిడుగుల కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. అదే విధంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం ధాటిగా కురిసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కొనసాగాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ద్రోణి కొనసాగుతుండటంతో రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, కడపతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన లైట్ టు మోడరేట్ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications