AP Temperatures : ఏపీలోని ఈ జిల్లాల్లో మంటలే- ఐఎండీ తాజా హెచ్చరికలు..!
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్ధితులపై ఎప్పటికప్పుడు వివరాలు అందించే వాతావరణ విభాగం ఏపీలో ఈసారి ఉష్ణోగ్రతలపై మంటెక్కించే వార్త అందించింది. ప్రతీ ఏటా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలోనే వడగాల్పులు కూడా అధికంగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మార్చి నెల నుంచే మంటలు తప్పవని వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో కూడా వెల్లడించింది.
ఏపీలో ఈసారి మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఏకంగా 40 డిగ్రీలకు పైగా చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అంచనా వేస్తోంది. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని, ఈ మేరకు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న విపత్తు నిర్వహణ సంస్ధ హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తోంది.

ఐఎండీ అంచనా ప్రకారం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు ఈసారి వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. దీనికి తగినట్లుగానే రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ సంస్ధ ఫోన్ల ద్వారా అలర్ట్ లు పంపబోతోంది.
ఎండలపై మరింత సమాచారం కోసం 112, 1070,18004250101 వంటి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications