ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం సడన్ గా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారింది. దీనికి తోడు నైరుతీ రుతుపవనాలు కూడా ఊపందుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 66.7 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అనంత పురం జిల్లా ఉరవకొండలో 5.16, పెంజెరువులో 4.25, సోమలింగపాలెంలో 4, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విశాఖ జిల్లా కణమాంలో 3.6 వర్షపాతం నమోదైంది.

ఎల్లో అలర్ట్ జారీ.. ముందస్తు హెచ్చరిక
అదే సమయంలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. జంగమహేశ్వరపురంలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. ఈ రోజు (మంగళవారం) రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తాలోని బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, దానికి ఆనుకుని తిరుపతిలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. ఇక, తెలంగాణలో జూలై 21వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications