ఇక 5 రోజులు వర్షాల జోరు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం పూర్తిగా చల్లబడనుందని అధికారులు వెల్లడించారు. ఏపీ ,తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని అంచనా వేసింది.
వాతావరణ శాఖ భారీ వర్షాల పై అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల ఈ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాలలో అక్కడక్కడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుందని అప్రమత్తం చేస్తున్నారు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే రాబోయే 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాలలో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

ఈదురుగాలులు.. వర్షాలు
ఏపీలోనూ వర్షాలు కొనసాగనున్నాయి. రానున్న అయిదు రోజసులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. కాగా,శ్రీకాకుళంతో పాటు ఉత్తర కోస్తాలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా వానలు పడవచ్చని అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాలలో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.













Click it and Unblock the Notifications