ఏపీలో కొత్త అల్లుడికి 1574 రకాల వంటకాలతో బాహుబలి విందు.. ఎక్కడంటే!
సంక్రాంతి అంటేనే తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పండుగ. పెద్ద పండుగగా చెప్పుకునే సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. అటువంటి సంక్రాంతి పండుగకు ఏపీలో అల్లుళ్లను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో అల్లుళ్లకు చేసే అతిధి మర్యాదలు ప్రతి ఒక్కరు కచ్చితంగా చెప్పుకుంటారు.
అల్లుడికి విందులో సరికొత్త రికార్డ్
గోదావరి జిల్లాలలో పెళ్లయిన తర్వాత కొత్తగా పెళ్లయిన కుమార్తె మొదటిసారి సంక్రాంతి పండుగకు తల్లిదండ్రుల ఇంటికి వస్తే అల్లుడికి ఇచ్చే విందు వార్తల్లో నిలుస్తుంది. వందల రకాల వంటకాలతో అల్లుడికి ఆతిథ్యం ఇచ్చి అన్ని వంటలను కొద్దికొద్దిగా రుచి చూపిస్తారు. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబం సరికొత్త రికార్డును సృష్టించింది.

1574రకాల వంటకాలతో విందు
అల్లుడికి ఏకంగా 1574రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఇంత భారీగా విందు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు అంటే నమ్మి తీరాల్సిందే. మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన విజ్జెపు వెంకటరత్నం, సుశీల దంపతుల కుమార్తె కీర్తి శ్రీ వివాహం గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగింది. పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన సాయిశరత్ తో ఆమె వివాహం ఘనంగా జరిగింది.
బాహుబలి విందు
పెళ్లయిన తర్వాత వారికి వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో, అల్లుడు సాయి శరత్ ను ఆశ్చర్య పరచాలని భావించిన అత్తమామలు ఆయన కోసం గ్రాండ్ గా విందును ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లుడికి 1574 రకాల వంటకాలతో బాహుబలి స్థాయిలో విందును ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన స్వీట్లు, పిండివంటలు, పలు రకాల పండ్లు, కూల్ డ్రింక్స్ ఇలా అన్నీ కలిపి విందులో వడ్డించారు.
అత్తమామల ప్రేమకు అల్లుళ్ళు ఫిదా
వీరు మాత్రమే కాదు ఏలూరు జిల్లాలో కైకరం గ్రామంలో ఏకంగా ఒక వెయ్యి 116 రకాల పిండివంటలతో అల్లుడికి ఆతిథ్యం ఇచ్చారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 271 రకాల వంటకాలతో, మొగల్తూరు పంచాయతీ నల్లం వారి తోటలో ఒక అల్లుడికి 260 రకాల వంటకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ అపూర్వమైన విందులో పసందైన వంటలను రుచి చూసిన అల్లుళ్లు మాత్రం వీళ్ళు భోజనం పెట్టి చంపేసేలా ఉన్నారని సరదాగా చమత్కరించారు. అత్తమామల ప్రేమకు ఫిదా అయ్యారు.












Click it and Unblock the Notifications