కర్నూలులో మంత్రులిద్దరూ అదరగొట్టేశారు!
ముందు మద్దతిచ్చి తర్వాత ఫోర్జరీ చేయించారనడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నెమ్మదిగా ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏకగ్రీవం కోసం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రంగంలోకి దిగారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వైసీపీ సమన్వయకర్తలు కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎ.మధుసూదన్, టీడీపీ సహకారంతో ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి, స్వతంత్రులుగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నర్ల మోహన్‌రెడ్డి నామినేషన్ వేశారు. కె.శ్రీనివాసులును ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన బేతంచర్లకు చెందిన ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లను అర్థరాత్రి బలవంతంగా తీసుకెళ్లి.. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని రిటర్నింగ్ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయించడంతో ఆయన ఈ నామినేషన్‌ను తిరస్కరించి కేసు నమోదుకు ఆదేశాలు జారీచేశారు. ముందు మద్దతిచ్చి తర్వాత ఫోర్జరీ చేయించారనడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నర్ల మోహన్‌రెడ్డి, భూమా వేణుగోపాల్‌రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. విత్‌డ్రాకు 27వ తేదీ వరకు గడువుండటంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరితో నామినేషన్లు విత్‌డ్రా చేయించే బాధ్యతను మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించే వ్యూహ రచనపైనా మంత్రులు చర్చించారు. వైసీపీ నాయకులు ఐకమత్యంగా పనిచేయకపోతే ఊరుకునేది లేదని మంత్రులు హెచ్చరించారు. కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్‌ఖాన్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు












Click it and Unblock the Notifications