TTD: జనవరిలో రికార్డు స్థాయిలో శ్రీవారికి ఆదాయం, హుండీలో వందల కోట్లు, కోట్లలో లడ్డూలు విక్రయం
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతి హిందువు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటాడు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలకు వెళ్లాలని దేశ విదేశాల్లోని హిందువుల ఆరాటపడుతుంటారు. అలాంటి తిరుమలలో శ్రీనివాసుడిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని వారి కోరికలు తీర్చాలని స్వామివారిని వేడుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
నూతన సంవత్సరంతో పాటు జనవరి నెలలో సంక్రాంతి వరుస సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీతో కిటకిటలాడిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనానికి రూ 300 ప్రత్యేక టిక్కెట్లు తీసుకున్న భక్తులతో పాటు ఎస్ఎస్ డీ టోకన్లు లేకుండా వేలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

2024 నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1వ తేదీన తిరుమలకు భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. జనవరి నెలలో సంక్రాంతి పండుగ వరుస సెలవులు రావడం, తమిళ సోదరులకు సంక్రాంతి సందర్బంగా ప్రత్యేక పండుగ రావడంతో తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. సంక్రాంతి వరుస సెలవుల సందర్బంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటలకు పైగా భక్తులు క్యూకాంప్లెక్స్ లో వేచి ఉన్నారు.

జనవరి నెలలో శ్రీవారిని ఎంత మంది భక్తులు దర్శించుకున్నారు, హుండీ ఆదాయం ఎంత, ఎన్ని లడ్డూలు విక్రయించారు అని పూర్తి సమాచారాన్ని ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గత జనవరి నెలలో తిరుమలలో శ్రీవారిని 21. 09 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 116. 46 కోట్లు వచ్చింది. హుండీ రూపంలోనే రూ. 116. 46 కోట్ల నగదును భక్తులు శ్రీవారికి సమర్పించుకున్నారు.
నూతన సంవత్సరం, సక్రాంతి వరుస సెలవులు, నెలలో వచ్చిన పలు ఆదివారాలలో తిరుమలకు భారీ సంఖ్యలో శ్రీవారి భక్తులు చేరుకున్నారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు 1. 03 కోట్ల లడ్డూలను విక్రయించారు. తిరుమలలో 46. 46 లక్షల మంది శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం అందించామని టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి నెలలో 7. 05 లక్షల మంది భక్తులు కల్యాణకట్టలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొత్త సంవత్సరం మొదలైన జనవరి నెలలోనే టీటీడీకి భారీ మొత్తంలో ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ గురువారం 57, 223 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన హుండీ కానుకల రూపంలో రూ. 3. 44 కోట్లు స్వామి వారికి సమర్పించుకున్నారు.












Click it and Unblock the Notifications