వైసీపీదే పాపం ఐతే..: చంద్రబాబు సర్కారుకు షర్మిల ‘లాంతరు’ నిరసన
విజయవాడ: సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ మేరకు లాంతర్ పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పెరిగిన చార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలి. లాంతర్లు కొనుక్కోవాలి అని అన్నారు.
వైసీపీ హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు. వైసీపీకి కూటమికి తేడా ఏమీ లేదు. ఇదెక్కడి న్యాయం అని షర్మిల ప్రశ్నించారు. ఇది వైసీపీ చేసిన పాపం అంటున్నారు. 4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టరాట అని ధ్వజమెత్తారు.

అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారట. తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకు ? అని షర్మిల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలి ? ఇప్పటికే ఏపిలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే..
ఆంధ్రలో యూనిట్ కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారని షర్మిల తెలిపారు.
ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసీపీ మీద వ్యతిరేకత తోనే. ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం. వైసీపీ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. విచారణ జరపండి అని చంద్రబాబు సర్కారును వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా సైకోల బాధితురాలిని: షర్మిల
తాను కూడా సోషల్ మీడియా సైకోల బాధితురాలినేనని షర్మిల చెప్పారు. సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా , రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు అని ఆమె మండిపడ్డారు.
సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను... అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ .. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications