పంద్రాగస్టు స్పెషల్- విద్యుత్ వెలుగుల్లో త్రివర్ణ శోభితంగా ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు..
ఏపీలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 9 గంటలకు సీఎం జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ దళాలతో గౌరవ వందనం కూడా స్వీకరిస్తారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, సచివాలయంతో పాటు అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. అమరావతిలోని అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, విజయవాడలోని గవర్నర్ నివాసం రాజ్ భవన్ తో పాటు పలు ప్రభుత్వ భవనాలు త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్నాయి. రేపు పంద్రాగస్టు కావడంతో ఎప్పటిలాగే ప్రభుత్వం అన్ని కార్యాలయాల్ని రంగులతో నింపేసింది. రంగురంగుల లైటింగ్ లో ప్రభుత్వ కార్యాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని అధికారులు, మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులు ఆవిష్కరిస్తారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో స్పీకర్, మండలి ఆవరణలో ఛైర్మన్, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్, రాజ్ భవన్, సచివాలయం, సీఎం క్యాంపు ఆఫీసుల్లో ఉన్నతాధికారులు త్రివర్ణ పతాకం ఎగరేస్తారు. ఈ నేపథ్యంలో ఆయా భవనాలపై ప్రత్యేకంగా త్రివర్ణ రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు.

పంద్రాగస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అమరావతిలో సీఎం, గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. ఆగస్టు 15 వేడుకల్ని భగ్నం చేసేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నించే అవకాశం ఉండటంతో అన్ని చోట్ల భద్రత పెంచారు. ఇందిరాగాంధీ స్డేడియంలో సీఎం, గవర్నర్ హాజరు కానుండటంతో ఒకరోజు ముందుగానే పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications