వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్..!
ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేసి ఎన్నికల్లో మద్దతు కోరారు. ఈ తరుణంలోనే జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
సుదర్శన్ రెడ్డి అభ్యర్థనపై జగన్ స్పందన..
జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన జగన్.. ఇండియా కూటమి అభ్యర్థి పేరును ప్రకటించే ముందే ఎన్డీఏ నేతలు తమ వద్దకు వచ్చారని అన్నారు. అప్పుడే వారికి మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పామని.. ఆ హామీ నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం సుదర్శన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తానని జగన్ చెప్పారని సమాచారం.

సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానంలో పనిచేసి ప్రజలకు అపారమైన సేవలు అందించారని వైసీపీ అధినేత కొనియాడారు. న్యాయ నిపుణుడిగా ఆయనకు ఉన్న ఖ్యాతి అభినందనీయం అని కితాబు ఇచ్చారు. ముందుగానే ఇచ్చిన మాట కారణంగా మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని ఎవరూ అపార్థం చేసుకోవద్దని.. రాజకీయ పరమైన కారణాలతోనే మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సి వస్తోందని వివరించారు.
మరోవైపు వైసీపీ అధినేత వ్యాఖ్యలతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు అని తేలిపోయింది. దీంతో రాజకీయ వర్గాల్లో వైసీపీ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇండియా కూటమి అభ్యర్థి పట్ల గౌరవం ఉన్నా, జగన్ ఇచ్చిన మాట, రాజకీయ వ్యూహమే ఎన్డీఏ అభ్యర్థికి పెద్ద బలం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఈ నిర్ణయం ద్వారా మళ్లీ ఒకసారి ఎన్డీఏతో సాన్నిహిత్యం కొనసాగించాలన్న సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ సమీకరణలపై కూడా ఈ విషయం ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే 394 ఓట్లు సాధించాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి.ఆనందన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నితిన్ కుమార్ శివదాస్‌లను అబ్జర్వర్లుగా ఈసీ నియమించింది.












Click it and Unblock the Notifications