ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు
ఆంధప్రదేశ్ ప్రజలకు, రైతులకు భారత వాతావరణ శాఖ తియ్యటి శుభవార్తను వినిపించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ నైరుతి రుతుపవనాల ప్రభావంపై ముందస్తు అంచనాలను వెల్లడించింది. ఏపీలో సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వడగాడ్పులు, ఎండలతో మండిపోతున్న ప్రజలకు వాతావరణశాఖ చెప్పిన కబురు ఎంతో ఊరట కలిగించింది. గతేడాది ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదని, దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు
కురవబోతున్న వానలు పంటకు ఎంతో మేలు చేస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు ఎప్పుడు రానున్నాయనే విషయమై మే నెలాఖరుకు ఒక స్పష్టత వస్తుంది. జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. ఎనిమిది రోజులు ఆలస్యంగా గతేడాది ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా ఏపీకి ఎంతో నెమ్మదిగా ప్రయాణించాయి. సకాలంలో వర్షాలు కురవలేదు. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమవుతుంది. దీనివల్ల అధిక వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలియజేశారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్తంత ముందుగా లేదంటే అనుకున్న సమయానికే ప్రవేశిస్తాయని భారతదేశ వాతావరణ శాఖ అధికారులు రెండురోజుల క్రితమే తెలియజేశారు. ఎల్ నినో ప్రభావం కూడా తగ్గిపోతుందని, హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడటంతో రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు అన్నిరకాలుగాను వాతావరణం చల్లబడుతుందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వడగాడ్పులు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 45 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications