ఏపీకి హెచ్చరిక జారీచేసిన వాతావరణశాఖ
ఏపీలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. కోస్తాలో ఒక మోస్తరుగా వేడిగాలులు వీస్తుండగా ఉత్తరాంధ్రలో మాత్రం తీవ్రంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 67 మండలాల్లో మోస్తరుగా, 35 మండలాల్లో తీవ్రంగా వడగాడ్పులు వీచాయి. అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లోని 31 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, పల్నాడు నుంచి శ్రీకాకుళం వరకు 139 మండలాల్లో వేడిగాలు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో కొద్దిరోజులుగా వేడిగాలు తగ్గుముఖం పట్టడంతోపాటు ఎండలు కూడా తగ్గాయి. అయితే ఇవి ఒక్కసారిగా పెరిగాయి. ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీనివల్ల ఉష్ణతాపం తగ్గుతందని ఐఎండీ అంచనా వేసిందికానీ మారిన వాతావరణ పరిస్థితులు ఏపీపై ప్రభావం చూపించలేకపోయాయి. వర్షాలు కురవలేదు. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

రానున్న నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో 41నుంచి 44 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లి, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది.
అత్యవసరమైన పనులుంటేనే మధ్యాహ్నంవేళ బయటకు వెళ్లాలని, తప్పనిసరిగా గొడుగులు ధరించాలని వాతావరణశాఖ సూచించింది. వైద్యుల సలహా మేరకు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, దాహం వేసినా, వేయకపోయినా తరుచుగా నీరు తాగుతుండాలని, అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన పనులుంటే ఉదయం వేళ, సాయంత్రం వేళ పూర్తిచేసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications