Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు
అమరావతి: ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. అంబటి రాయుడుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
గత కొంత కాలంగా అంబటి రాయుడు ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. వీలైనప్పుడల్లా జగన్ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు బాటలు వేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేరడం గమనార్హం. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఎంపీగా పోటీ చేయాలని రాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే గుంటూరు లేదా ఇతర స్థానం నుంచి పోటీ చేసే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీలో చేరిన సందర్బంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మొదట్నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కుల, మతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని అంబటి రాయుడు ప్రశంసించారు. అందుకే ఆయనకు తన మద్దతును గతంలో కూడా తెలిపినట్లు చెప్పారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు..!#YSJagan #CMYSJagan #AmbatiRayudu #YSRCParty #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/EWx0l6caXX
— oneindiatelugu (@oneindiatelugu) December 28, 2023
తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు తెలిపారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. కాగా, గత కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న రాయుడు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, యువతను కలుస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications