చరిత్ర సృష్టించబోతున్న వందే భారత్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సౌకర్యాలతో భారతీయ రైల్వే రైళ్లను తయారుచేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరాన్ని తగ్గించేందుకు సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. మొత్తం 25 మార్గాల్లో 50 సర్వీసులందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి కూడా వీటికి ఆదరణ బాగా దక్కుతోంది.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ వందే భారత్ ను నడపాలని నార్తర్న్ రైల్వే డివిజన్ యోచిస్తోంది. అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ ప్రాంతాలను ఒకే వందే భారత్ ద్వారా కలపాలని భావిస్తున్నారు. దీనివల్ల పర్యాటక రంగం ఉత్తేజితమవుతుందంటున్నారు. ప్రస్తుతం గోరఖ్‌పూర్-లక్నో రూట్‌లో వందే భారత్ నడుస్తోంది. లక్నో నుంచి అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ ను తిప్పాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

దీన్ని రైల్వే బోర్డుకు నార్తర్న్ రైల్వే అధికారులు పంపించారు. మూడు ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ అందుబాటులోకి రాబోతున్న తొలిరైలుగా వందే భారత్ చరిత్ర సృష్టించబోతోంది. వేర్వేరు ఆధ్యాత్మిక క్షేత్రాలకు పర్యటించాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అధికారులు చేసిన ప్రతిపాదన ప్రకారం ఈ రైలు ఉదయం 6.00 గంటలకు లక్నోలో ప్రారంభమవుతుంది.
అనంతరం అయోధ్య, ప్రయాగ్ రాజ్ మీదగా వారణాసికి చేరుకుంటుంది. 430 కిలోమీటర్ల దూరాన్ని ఐదున్నర గంటల్లో కవర్ చేయబోతోంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తుంది. మధ్యాహ్నం వారణాసిలో బయలుదేరి రాత్రికి లక్నో చేరుకుంటుంది. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా పలు డివిజన్లలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేబోతున్నారు.












Click it and Unblock the Notifications