రైల్వే గుడ్ న్యూస్: వెయిటింగ్ లిస్ట్ కు గుడ్ బై
టికెట్ బుకింగ్‌లో ప్రయాణికుడికి వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేసేందుకు భారతీయ రైల్వే (Indian Railways) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం రాబోయే 15 సంవత్సరాల్లో సుమారు రూ.లక్ష కోట్ల విలువైన కొత్త రైళ్లను కొనుగోలు చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఓ జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పాత రైళ్ల స్థానంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల కొత్త రైళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. వీటి కోసం రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో టెండర్లు ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా రైళ్లను అందుబాటులో ఉంచాలని రైల్వే నిర్ణయించింది. రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు ట్రాక్‌లు, భద్రతాపరమైన సాంకేతికతను కూడా మెరుగుపరచనుంది. ప్రస్తుతం రైల్వే రోజుకు 10,754 ట్రిప్పులను నిర్వహిస్తోంది. మరో మూడు వేల ట్రిప్పులను అదనంగా తిప్పితే వెయిటింగ్ లిస్టు అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు.

కొవిడ్ కు ముందు ఉన్న పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితితో పోలిస్తే 568 ట్రిప్పులు అదనంగా నిర్వహిస్తోంది. ఏడాదికి సుమారు 700 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య వెయ్యి కోట్లకు చేరుతుందనే అంచనా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు కేటాయించిన రూ.2.4 లక్షల కోట్ల బడ్జెట్‌లో 70 శాతం నిధులను పూర్తిగా ఉపయోగించుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు దేశవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్ నిర్మాణం పూర్తికానుంది. 2022-23లో సగటున 14 కిలో మీటర్ల మేర ట్రాక్‌లను నిర్మించగా.. ఈ ఏడాది సగటున రోజుకు 16 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ల నిర్మాణం జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications