విజయవాడ టు సింగపూర్ ఇండిగో కొత్త సర్వీసు, టికెట్ ధర.. టైమింగ్స్..!!
విజయవాడ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. పలు ప్రాంతాలకు ఇప్పటికే సర్వీసులు కొనసాగుతున్నాయి. ఆక్యుపెన్సీకి అనుగుణంగా సర్వీసుల నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఇండిగో సంస్థ సింగపూర్ కు డైరెక్ట్ ఫ్లైట్ ను ప్రారంభించనుంది. ఇందుకు ముహూర్తంతో పాటుగా టికెట్ ధర.. విమాన వేళలను సంస్థ ప్రకటించింది. దీంతో.. నాలుగు గంటల్లోనే సింగపూర్ కు వెళ్లే అవకాశం దక్కుతోంది.
ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో విజయవాడ నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసుల ను ప్రారంభించనుంది. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఛార్జీలు.. టైమింగ్స్ ను ప్రకటించారు. ఈ సర్వీసుకు టికెట్ ధరను రూ.8,000గా ఇండిగో సంస్థ వెల్లడించింది. సింగపూర్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదే విధంగా అనంతరం విజయవాడ నుంచి ఉదయం 10.05 గంటలకు తిరిగి బయలుదేరి.. మధ్యాహ్నం 2.05కు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుంది. ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటలు ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.

కాగా, ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రతి మంగళవారం,గురువారం,శనివారం రోజుల్లో నడుస్తాయి. 180 నుండి 230 సీట్ల సామర్థ్యం గల బోయింగ్ విమానాలను ఇండిగో సంస్థ ఈ మార్గంలో వినియోగించనుంది. ప్రారంభ దశలో వారానికి మూడు రోజుల పాటు మాత్రమే సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీసులుగా విస్తరించే ఆలోచనలో సంస్థ ఉంది. గతంలో 2018 డిసెంబరు నుండి 2019 జూన్ వరకు విజయవాడ-సింగపూర్ రూట్‌పై ఇండిగో నడిపిన విమానాలను నడిపింది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు సర్వీసులను విమాన సంస్థలు విస్తరిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications