త్వరలో విజయవాడ నుంచి ఇండిగో సర్వీసులు
అమరావతి: ఎపి ప్రయాణికులకు శుభవార్త...భారతదేశంలో చౌక విమానయాన సంస్థ అయిన ఇండిగో విజయవాడ నుంచి విమాన సేవలను అందించేందుకు సిద్ధమైంది. అతి త్వరలోనే ఇండిగో విజయవాడ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.
విజయవాడ నుంచి దేశంలోని వివిధ ప్రముఖ నగరాలకు విమాన సేవలను నడిపేందుకు ప్రముఖ విమాన యాన సంస్థ ఇండిగో సంసిద్ధమైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు వచ్చే ఏడాది మార్చి 2 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనుంది. విజయవాడ - హైదరాబాద్ మధ్య రెండు సర్వీసులు, బెంగళూరు - విజయవాడ మధ్య రెండు సర్వీసులు, చెన్నై- విజయవాడ మధ్య ఒక విమాన సర్వీసును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇండిగో గురించి...
ఇండిగో భారతదేశంలోని బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థ. ఇండిగోను ప్రత్యేకంగా గుర్తించేందుకు వీలుగా ఎక్కువగా ఊదారంగు మరియు తెలుపు రంగుతో విమానాలను డిజైన్ చేస్తారు. విమానరెక్కల అడుగుభాగంలో ఆకాశ నీలిరంగుతో కూడిన చారలు పెయింటింగ్ చేస్తారు. విమాన పై భాగంలో తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో విమానసంస్థ పేరు "ఇండిగో" అనే ఊదారంగు అక్షరాలతో రాసి ఉంటుంది. విమానాల ముక్కు భాగంలో చుక్కలతో కూడిన గీతల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
అతి చవకైన విమానసంస్థగా పేరున్న ఇండిగో విమానాల్లో కేవలం సాధారణ తరగతి సీట్లు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా రేట్లు తక్కువగా ఉన్నందున ఎలాంటి కాంప్లిమెంటరీ భోజనాన్ని కూడా ఇండిగో విమానాల్లో అందించరు. అయితే కార్పోరేట్ ప్రయాణీకుల కోసం ఇండిగో కార్పోరేట్ ప్రోగ్రామ్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగా ప్రీ-అస్సైన్డ్ సీట్లు, భోజనం లాంటి సదుపాయాలు కల్పిస్తారు.












Click it and Unblock the Notifications