దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి ఏరోజు శుభప్రదం..!?
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తుల సౌకర్యం కోసం పాలక మండలితో పాటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. అయితే, ఈ ప్రత్యేక రోజుల్లో ఏ రోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభప్రదమనే భక్తుల సందేహాలకు పండితులు స్పష్టత ఇస్తున్నారు.
ఇంద్రకీలాద్రి పై నేడు ప్రారంభమైన శరన్నవరాత్రులు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించేందు కు భారీ ఏర్పాట్లు చేసారు. దర్శనాలు.. భక్తుల సదుపాయాల పైన ఇప్పటికే ఆలయ అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. కాగా, ఈ శరన్నవరాత్రుల వేళ రోజుకో అలంకారంతో దుర్గమాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. చూసే వారికి కన్నుల పండువగా కనిపించే ఈ అలంకారాలతో దుర్గమ్మ భక్తులకు అభయం ఇవ్వనుంది. తొలి రోజు బాలా త్రిపుర సుందరిగానూ, రెండో రోజు గాయత్రీ దేవి రూపంలోనూ, మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు కాత్యాయని దేవిగా, ఐదో రోజు మహాలక్ష్మి అవతారంలోనూ, ఆరో రోజు శ్రీలలితా త్రిపుర సుందరి దేవిగా, ఏడో రోజు మహా చండీదేవిగా, ఎనిమిదో రోజు సరస్వతిదేవీగా, తొమ్మిదో రోజు దుర్గాదేవిగా, పదవ రోజు మహిషాసుర మర్ధనిగా, పదకొండో రోజు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లక్షలాది మంది భక్తులు కొండపైకి వస్తుండటంతో క్యూ లైన్లతో పాటు తీర్థ ప్రసాదాలను కూడా ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
కాగా, ఈ శరన్నవ రాత్రుల ఉత్సవాల వేళ ఏ రోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభప్రదమనే చర్చ భక్తుల్లో ఉంది. అయితే.. మూలా నక్షత్రం రోజు (సరస్వతీ దేవి అలంకారం) అత్యంత విశిష్టమైనది మరియు ప్రసిద్ధమైనది. అయినప్పటికీ, నవరాత్రులలో ప్రతి రోజూ అమ్మవారు ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తారని.. ప్రతీ రోజు కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో శుభప్రదంగా ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు. ఇక.. వీవీఐపీ వాహనాలను తప్పించి ఇంద్రకీలాద్రిపైకి ఈ నవరాత్రుల్లోనూ ఏ వాహనాన్ని అనుమతించే అవకాశం లేదు. భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో రావాలి. శరన్నవరాత్రులు జరిగే ప్రతి రోజూ రోజుక లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
