ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు, భక్తులకు కీలక సూచనలు - ఆ దర్శనం రద్దు..!!
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది. ఆలయ అధికారులు ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మూలా నక్షత్రం రోజున రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సారి అంతరాలయ దర్శనం రద్దు దిశగా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. దసరా వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేసారు.
ఇంద్రకీలాద్రికి ప్రతీ ఏటా దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ సారి అదే స్థాయిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఏటా దసరా పండక్కి అంతరాలయ దర్శనం పేరుతో రూ.500 టికెట్లు విక్రయించే వారు. తర్వాత రద్దీగా ఉందంటూ ముఖమండపం వరకే అనుమతించే వారు. దీంతో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా పూర్తిగా అంతరాలయ దర్శనం రద్దు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దసరాకు రూ.300 ముఖమండప దర్శనం మాత్రమే ఉంటుంది.

దసరా ఉత్సవాల తర్వాత మళ్లీ అంతరాలయ దర్శనాలను పునరుద్ధరించి రూ.500, రూ.300, రూ.100, ఉచిత టికెట్ల క్యూలైన్లను కొనసాగించనున్నట్లు సమాచారం. వేడుకలకు 11 రోజుల్లో ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల మంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. మొదటి నాలుగు రోజులు నిత్యం 70వేల నుంచి లక్ష మంది, ఆ తర్వాత 6 రోజులు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకూ భక్తులు వస్తుంటారు. మూలా నక్షత్రం రోజున మాత్రం రెండున్నర లక్షల మంది వరకూ భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకూ దర్శించుకుంటారు. దసరా ఉత్సవాల షెడ్యూల్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.
సెప్టెంబర్ 22న బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణ చేయనున్నారు. 23న గాయత్రీ దేవి అలంకరణ లో అమ్మవారు దర్శనం ఇస్తారు. 24న అన్నపూర్ణా దేవి అలంకరణ ఉంటుంది. 25న కాత్యాయని దేవి అలంకరణ చేయనున్నారు. 26న మహాలక్ష్మీ దేవి అలంకరణ లో దర్శనం ఉంటుంది. 27న లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ ఉండనుంది. 28న మహాచండీ దేవీ అలంకరణ నిర్వహించనున్నారు. 29న మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకరణ లో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. 30న దుర్గాదేవి అలంకరణ ఉంటుంది. అక్టోబర్ 1న మహిషాసురమర్ధిని అలంకరణ ఉంటుంది. అక్టోబర్ 2న రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications