తిరుమలలో భక్తులు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య- పరిష్కారం కోసం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 63,843 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,344 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలకు వస్తోన్న లక్షలాదిమంది భక్తులు ఎదుర్కొంటోన్న ఓ ప్రధాన సమస్యను పరిష్కరించడానికి టీటీడీ నడుం బిగించింది. దీనికోసం టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం ఏర్పాటైంది.
అదే- ఘన వ్యర్థాల నిర్వహణ. తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణ అనేది సవాల్ గా మారింది. గోగర్భం డ్యామ్ సమీపంలోని వ్యర్థాల కేంద్రంలో వేల మెట్రిక్ టన్నుల పచ్చి, పొడి వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. 86,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు శుద్ధి చేయకుండా పేరుకుపోయినట్లు ఇదివరకు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ కొత్త వ్యూహాలను అన్వేషిస్తోంది. వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఐఓసీఎల్ తో 50:50 భాగస్వామ్యంతో బయో-గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ తిరుమలలో ఉత్పత్తి అయ్యే భారీ మొత్తంలో తడి వ్యర్థాల నుంచి బయో-గ్యాస్, ఎరువును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిపై టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. తడి చెత్తను ఉపయోగించి బయో గ్యాస్, ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ-ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడిచెత్త- పొడిచెత్త విభజన అవసరం లేకుండా ఏవిధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పద్ధతులను అన్వేషించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త శరద్ ఖలే మాట్లాడుతూ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారం అని పేర్కొన్నారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికను అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేంద్రీయ ఎరువులు తయారీ విధానాన్ని ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications