కలుసుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు.. కారణం అదే ?
తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలుసుకోనున్నారు. ప్రజాభవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వారి మధ్య దాదాపు గంటన్నరకు పైగా సమావేశం కొనసాగింది. ఆ మీటింగులో విభజన చట్టంలో ఆస్తులు, అప్పులపై ముఖ్యమంత్రులు చర్చించారు. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
అయితే ఈసారి మాత్రం ఓ వివాహ వేడుకలో సీఎంలు ఇద్దరు కలుసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రేపు ( ఏప్రిల్ 30వ తేదీన ) తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహాం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వధూవరులను ఆశీర్వదించి తిరిగి హైదరాబాద్ రానున్నారు. గత వారం హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి దేవినేని.. తన కుమారుడు పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

మరోవైపు ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో అటు రాజకీయాల పరంగా.. ఇటు పర్సనల్ గా కూడా వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో రేవంత్ పని చేశారు. ఆ సమయంలోనే దేవినేని ఉమాతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఇక పార్టీ మారి సీఎం అయిన తర్వాత కూడా వారి మధ్య అవినాభావ సంబంధం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో మిత్రుడి ఆహ్వానం మేరకు వివాహా వేడుకకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. అందుకే రేపు ( ఏప్రిల్ 30 ) విజయవాడ వెళ్లనున్నారు.
ఇక విజయవాడ పర్యటన కోసం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఆ తర్వాత ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10.50 గంటల నుండి 11.30 గంటల వరకు అయన వివాహ వేడుకలో ఉంటారు. చివరగా విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు సీఎం రేవంత్.












Click it and Unblock the Notifications