
చీరాల వైసీపీలో వర్గ పోరు .. ఆమంచి అనుచరుడిపై దాడి, ఎస్పీ దాకా వెళ్ళిన పంచాయితీ
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా, మంత్రులే రంగంలోకి దిగినా వివాదం సమసిపోని పరిస్థితి. తాజాగా కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ మీద, బలరాం పిఏ త్రివేణి మీద మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో చీరాల వైసీపీలో ఉన్న అంతర్గత కలహాలు మరోమారు రోడ్డుకెక్కాయి.
విజయవాడలో తగ్గని మున్సిపల్ ఎన్నికల కాక .. జోరుగా బెట్టింగ్ లు, మరోమారు బోండా ఉమా సవాల్

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రధాన అనుచరుడిపై దాడి
అసలు వివాదం ఏమిటంటే ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి సమయంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రధాన అనుచరుడు రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. డ్యూటీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో రాంబాబుపై దాడి చేయగా, రాంబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రాంబాబుని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, రాంబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని గుంటూరు తరలించారు.

కరణం వెంకటేష్, బలరాం పిఏ త్రివేణీ పాత్ర ఉందని ఆమంచి కృష్ణమోహన్ ఎస్పీకి ఫిర్యాదు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించి రాంబాబుపై దాడి చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో తన పీఏ రాంబాబు పై దాడి చేసిన ఘటనలో చీరాల రూరల్ సీఐ రోశయ్య, ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, బలరాం పిఏ త్రివేణీ పాత్ర ఉందని ఆమంచి కృష్ణమోహన్ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులుగా వారిని చేర్చాలని ఆయన తన ఫిర్యాదులోఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

కేసులో చీరాలతో సంబంధంలేని పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్
అంతేకాదు ఈ కేసుపై చీరాలతో సంబంధంలేని పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో, ఎన్నికల పై శ్రద్ధ పెడుతున్న తమ దృష్టిని మరల్చి ఉద్రిక్తతలు పెంచడం కోసం, తనను ఫెయిల్ చేయడం కోసం తన పీఏపై దాడి చేశారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. గతంలో కూడా కరణం వర్గీయులు ఆమంచి వర్గీయులపై దాడులు చేసిన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒకే పార్టీలో ఉన్నా సరే ఇద్దరు నేతలు శత్రువుల్లా పోరాటం సాగిస్తూనే ఉన్నారు .

చీరాల రాజకీయాల్లో మారని వర్గపోరు .. ఆమంచి వర్సెస్ కరణం బలరాం
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందంగా మొదటి నుంచి చీరాల రాజకీయాలలో ఉప్పు నిప్పులా ఉన్న కరణం బలరాం ,ఆమంచి కృష్ణమోహన్ లు వైసీపీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు, ప్రతి దాడులు, విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ అధికార పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు. ఇక వీరి మధ్య వివాదానికి చెక్ పెట్టడానికి ఎన్నిసార్లు మంత్రులు ప్రయత్నం చేసినా బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది. దీంతో వైసిపి వర్గ పోరు చీరాల రాజకీయాల్లో అటు రాజకీయ పార్టీలకు, ఇటు ప్రజలకు చిరాకుగా మారింది.