కోనసీమలో ఇంటర్నెట్ పునరుద్దరణ - పోలీసుల చేతిలో గుట్టు : తాజా అరెస్టులతో..!!
కోనసీమలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమలాపురంలో విధ్వంసం వెనుక సూత్రధారులను గుర్తించే ప్రక్రియ వేగవంతం అయింది. వాట్సప్ సందేశాలతో విధ్వంసాలను ప్రణాళికలు అమలు చేసారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. దీంతో...అల్లర్లు జరిగిన వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. వారం రోజుల తరువాత తిరిగి పాక్షింగా సేవలను ఇప్పుడు పునరుద్దరించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు వారం రోజులుగా అమలాపురంలోనే మకాంవేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో తాజాగా మరో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

71కి చేరిన అరెస్టులు
దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 71కి చేరింది. మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న మలికిపురం, సఖినేటిపల్లి, ఆత్రేయపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. మిగిలిన పన్నెండు మండలాల్లో నెట్ సేవలపై మరో 24 గంటల పాటు నిషేధం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఈ ఘర్షణల వెనుక ఎవరున్న కేసులు నమోదు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాజకీయంగా ఒక పార్టీ పై మరో పార్టీ విమర్శలు చేస్తోంది. తాజాగా టీడీపీ - జనసేన కార్యకర్తలు ఉన్నారంటూ వారి ఫొటోలు - పేర్లతో వైసీపీ ట్వీట్లు చేసింది.

రాజకీయంగా ఆరోపణలతో
తొలి నుంచి టీడీపీ - జనసేన పైన వైసీపీ ఆరోపణలు చేస్తుంటే...టీడీపీ - జనసేన అధినేతలు మాత్రం ఇదంతా వైసీపీ నేతలే వీటి వెనుక ఉన్నారంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. కానీ, పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేసిన వారి వెనుక రాజకీయ సంబంధాల పైన ఆరా తీస్తున్నామని చెబుతున్నారు.
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్ రాష్ట్రంలో తాజా పరిస్థితుల పైన ఆరా తీసారు. కోనసీమ ఘటన ..తరువాతి పరిస్థితుల పైన అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయితే, తిరిగి ఎటువంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా అన్ని కోణాల్లోనూ పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.

సూత్రధారులను గుర్తించే పనిలో
పాత్రధారులను ఒక్కొక్కరిగా గుర్తించిన పోలీసులు..సూత్రధారులను గుర్తించే పని ప్రారంభించారు. ఎవరు వాట్సప్ సందేశాలు మొదలు పెట్టారు.. ఆ రోజు ఏం జరిగిందనేది మినిట్ టు మినిట్ సమాచారం పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో..త్వరలోనే పూర్తి విచారణ సమాచారం పోలీసులు అధికారికంగా బయట పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయటం వలన సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని.. ముందుగా నాలుగు మండలాల్లో పునరుద్దరించారు.












Click it and Unblock the Notifications